#


Index

గుణత్రయ విభాగ యోగము

కనుక జన్మించినప్పుడూ జీవిస్తున్నప్పుడే గాక రేపు మరణించేటపుడు కూడా గుణసంపర్కముంది. కాబట్టి మరణించిన తరువాత ఈ మానవుడికే ఫలిత మనుభవానికి వస్తుందో - అది కూడా వీడి కాక్షణంలో ఏ గుణం పైకి వచ్చి మరణం సంభవిస్తుందో- దాన్ని బట్టి కూడా నిర్ణయించవచ్చు వాడికి కలిగే ఫలానుభవం. అదే ఇప్పుడు మనకు వివరించి చెబుతున్నది.

యదా సత్త్వే ప్రవృద్ధేతు - ప్రలయం యాతి దేహభృత్
తదోత్తమ విదాంలోకా నమలాన్ ప్రతిపద్యతే - 14

  సత్త్వ గుణం బాగా పైకి వచ్చినప్పుడు జీవుడు మరణించాడను కోండి. వాడు మొదటి నుంచీ సాత్త్వికమైన గుణం సాత్త్వికమైన ప్రవృత్తీ ఉన్నవాడు. అంటే మనస్సు బాగా నిర్మలంగా పెట్టుకొని ఎప్పుడూ మంచి ఆలోచనలే ఆలోచిస్తూ వాటి కనుగుణంగా మంచి మాటలే మాటాడుతూ మంచి మంచి ధర్మకార్యాలు చేస్తూ బ్రతుకు సాగిస్తుంటాడు. చెడ్డ తలంపు ఎప్పుడూ రాదు వాడి మనస్సుకు. అలాటి తలంపే రాదు కాబట్టి చెడ్డగా నడుచుకోట మంటూ ఎప్పుడూ ఉండదు. మరి జ్ఞానముందా వాడికంటే ఉంటుంది గాని అది ఆత్మ జ్ఞానం కాదు. ధర్మజ్ఞానం. అదే ఇక్కడ సత్త్వా త్సంజాయతే జ్ఞానమనే మాట కర్థం. అసలైన జ్ఞానం కాదు. అసలైనది బ్రహ్మ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకొన్నప్పుడు మాత్రమే ఉదయిస్తుంది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు