#


Index

గుణత్రయ విభాగ యోగము

స్థితి. రెండవది అప్రవృత్తి. ఏ పనీ పెట్టుకోకుండా బద్ధకించి ఊరక మొద్దులాగా పడి ఉండటం · కాగా దాని వల్ల ఏర్పడేదే ఒకటి ప్రమాదమూ. మరొకటి మోహము. ప్రమాదమంటే పరాకు. పరధ్యానం. ఎక్కడో మనసు పెట్టుకొని కూచోటం. మోహమంటే అసలు వీడికి మనసనేది ఒకటి ఉందా లేదా అనిపించటం. మనసుకేదీ స్ఫురించని లక్షణం. తమస్యే తాని జాయంతే వివృద్ధే. తమస్సనేది రెచ్చిపోతే ఇదుగో ఇవీ అది బయటపడే లక్షణాలు. వీటిని చూచే అర్థం చేసుకోవచ్చు. వాడు తమస్సాగరంలో తలమునక లయిపోతున్నాడని.

  అలాగే రేపు మరణించే సమయంలో కూడా మానవుడీ గుణాలను వెంటబెట్టుకొనే పోతున్నాడు. ఎందుకంటే గుణసంపర్కం లేకపోతే అసలు జననం లేదు. మరణం లేదు. అవి రెండూ లేకుంటే జీవిత మసలే లేదు. జన్మ మొదలు మరణం వరకూ రాజ్యమేలుతున్నదీ త్రిగుణలే. గుణాత్మక మీ సృష్టి అంతా. మానవసృష్టి త్రిగుణాత్మకమే. గుణం లేదంటే అది గుణాతీతం. గుణాతీతం నామరూపరహితం. అది భగవత్తత్త్వ మొక్కటే మరేదీ గాదు. దానికే ఏ గుణమూ లేనిది. నిర్గుణమది. నిర్గుణమైతే నిరాకారం. సర్వవ్యాపకం. కాబట్టి జనన మరణాలు దాని కొక్క దానికే లేవు. మిగతా అనాత్మ ప్రపంచానికంతా అవి తప్పవు. అనాత్మ తో తాదాత్మ్యం చెందిన నేరానికీ జీవులకూ తప్పవు. అవే నడుపుతున్నాయి ఈ జీవుల జీవితాన్ని యావత్తూ.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు