వారి దగ్గర నుంచి కాజేద్దామనే బుద్ధికి లోభమని పేరు. ప్రవృత్తిః ప్రవర్తనం సామాన్య చేష్టా - మామూలుగా చేసే చేష్టలన్నీ ప్రవృత్తి క్రిందికి వస్తాయి. ఆరంభమంటే ఎప్పుడూ శాస్త్రోక్తమైన కర్మలన్నీ పాటిస్తూ పోవటం. అనుపశమమంటే వాటి నుంచి వైదొలగాలనే ఆలోచన లేకపోవటం. లేదా నిత్యమూ ఈ కర్మలాచరిస్తూ పోతే రాగద్వేషాలు తగ్గటానికి బదులవి అంతకంతకూ పెరిగి పోవటం. స్పృహా సర్వసామాన్య వస్తు విషయా తృష్ణా అని సెలవిచ్చారాయన. ఏ వస్తువైనా కోరింది మనకు లభిస్తే ఎంత బాగుండుననే కాంక్షకు స్పృహ అని పేరట. ఇవన్నీ నిదర్శనం మనకు రజోగుణం రెచ్చిపోయిందని చెప్పటానికి. ఇవి బయటపడి ఎవడి జీవితంలో కనిపిస్తూంటాయో వాడు రజోగుణ ప్రభావానికి లోనయి నాడని భావించవచ్చు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించాలంటారు శాస్త్రజ్ఞులు. ధూమాన్ని బట్టే గదా అగ్నిని చూడకపోయినా ఉందని అనుమానిస్తాము.
అప్రకాశో ఽ ప్రవృత్తి శ్చ ప్రమాదో మోహ ఏవచ
తమస్యే తాని జాయంతే- వివృద్ధే కురునందన - 13
సత్త్వమయింది. రజస్సయింది. పోతే తమో గుణం మిగతా రెండింటినీ మించి విజృంభించిందని చెప్పటానికేమిటి లింగమని ప్రశ్న వచ్చింది. వస్తే దానికిప్పుడు సమాధాన మిస్తున్నది గీత. అప్రకాశమనేది మొదటిది. అవివేకమని అర్థం ఏది ఏమిటో తెలియని అయోమయ