అవకాశముంది ఇందులో. అలాటి అవకాశ మెక్కడ ఏ గుణంలో ఎప్పుడుంటుందో చూపటానికే మహర్షి వీటి నింతగా వర్ణించటం.
సర్వ ద్వారేషు దేహేస్మిన్ - ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదావిద్యా - ద్వివృద్ధం సత్త్వమి త్యుత - 11
మనల నుద్ధరించటానికే ఇంకా ఒక రహస్యం చెబుతున్నాడు మహర్షి మనకు. యదా యో గుణ ఉద్భూతః భవతి - తదా తస్యకిం లింగం. ఎప్పుడెప్పుడే గుణంపైకి వస్తున్నదో దాన్ని గుర్తించట మెలాగా. దానికేదైనా నిదర్శనం కనపడుతుందా అని ప్రశ్న వేస్తున్నారు మన తరఫున భాష్యకారులు. దీనికి జవాబేమి చెబుతారో అందులో సత్త్వ గుణాన్ని పట్టుకొని దానివల్ల గలిగే సత్ఫలిత మనుభవానికి తెచ్చుకొనే ప్రయత్నమేమి చేయాలో వినండి.
మొదట సత్త్వగుణం పైకి వచ్చినట్టు ఎలా పోల్చుకోవాలో చెబు తున్నాడు. మనకు తోడ్పడేది ఎప్పుడూ సత్త్వగుణమేనని తెలుసుకోవాలి మానవుడు. అది గనిలో దొరికే రత్నం లాంటిది సహజంగా. రత్నమే అది. రాయి గాదు. సహజమైన ప్రకాశముంది దానికి. కాని సానబెట్టనిదే అది ప్రకటమై కనపడదు. అలాగే సత్త్వం పరిశుద్ధమైనదీ ప్రకాశ శీలమైనదీ. కాని రజస్తమనస్సులనే కల్మష మంటింది దానికి. కనుక దాని సహజ గుణం బయటపడకుండా మరుగు పడి పోయింది. రత్నానికి