ఇదంతా అజ్ఞాన జన్యమే. మాకెంతో లోకజ్ఞానం శాస్త్రజ్ఞాన ముందని విఱ్ఱ వీగే పండితులు కూడా పండిత మ్మన్యులే. కారణం వారనుకొనే జ్ఞానానికి కూడా ఈ మూడు దోషాలూ అనివార్యంగా ఉండి తీరుతాయి. వారు గ్రహించిన విషయాల మీదనే వారికి కొంత గుర్తుంటే కొంత గుర్తు లేక మరచిపోవచ్చు. ఇంకా తెలుసుకొందామనే కుతూహలం లేక బద్దకించవచ్చు. ఒకవేళ పగలంతా బ్రహ్మాండ నాయకుడని పించుకొన్నా రాత్రి నిద్రలో పడిపోయి అంతా మరిచిపోయి ఏమీ తెలియని బేవకూఫని పించుకోవచ్చు. ఇవి మూడూ లేని పండితుడెవడో చూపండి. కాగడా పెట్టి వెతికినా కనపడడు. ఇదుగో వీటి మూలంగా కట్టి పారేస్తున్నది ప్రతి ఒక్కరినీ ఈ తమోగుణమనే పిశాచి.
సత్త్వం సుఖే సంజయతి - రజః కర్మణి భారత
జ్ఞాన మావృత్యతు తమః - ప్రమాదే సంజయ త్యుత - 9
ఇంతవరకూ విడివిడిగా మూడు గుణాలనూ వర్ణించాడు. వాటి స్వరూపమూ చెప్పాడు. అవి చేసే పనీ చెప్పాడు. లక్షణమూ వ్యాపారమూ రెండూ వర్ణించట మయింది. కాగా వాటి వ్యాపారమే ఇప్పుడు విడిగా గాక మూడింటికీ కలిపి సంగ్రహంగా విడమరిచి చెబుతున్నాడు మహర్షి. వ్యాపారమంటే బేరసారాలని గాదు. అవి చేసే పని అని అర్థం