ప్రేరకమైనది చలనాత్మకమైన ఈ రజోగుణమే. అది చలించక పోతే రాగద్వేషాలను ప్రేరణ చేయదు. అవి ప్రేరణ చేయకపోతే కర్మ చేయలేడు మానవుడు. కర్మ చేస్తే చాలు. అది ఫలిత మివ్వకుండా పోదు. అందులో సత్కర్మ అయితే సత్ఫలితం. దుష్కర్మ అయితే దుష్ఫలితం. ఇది అనుభవానికి వస్తే అదే సంసార బంధం మానవుడికి. ఇంతదూరమున్న దీరజో గుణ ప్రభావం.
తమ స్త్వజ్ఞాన జం విద్ధి - మోహనం సర్వ దేహినాం
ప్రమాదాలస్య నిద్రాభి - స్తన్ని బధ్నాతి భారత - 8
ఇక తమో గుణ ప్రభావమేమిటో చెబుతున్నాడు. వినండి. తమస్సనేది మరీ అన్యాయం. రజస్పైనా కొంచెం మేలు. చలనాత్మకమైనా అది బుద్ధిని స్పందింప చేస్తుంది. స్పందన వల్లనే బుద్ధి ఎటో ఒకవైపు ప్రసరించ గలదు. స్పందనే లేకుంటే అది జడమై స్తంభించి పోతుంది. ఏ ప్రయత్నమూ చేయలేదు. అయితే ఎటు వచ్చీ ఆ ప్రయత్నం విషయాభిముఖంగా సాగిపోతుంది తరుచుగా. అదీ ప్రమాదం. విషయాల వైపు కాకుండా ఆత్మాభిముఖంగా సాగేలా చూచుకోవాలా ప్రయత్నం. అప్పుడది సత్త్వగుణాని కందించి మనకు మేలు చేస్తుంది. లేకుంటే అంతా కీడే. తమో గుణంలో పడిపోవటమే అది చేసే కీడు.