మాత్రమెంతైనా సహాయపడుతుందిది మోక్ష మార్గంలో. కాని మిగతా రెండున్నాయే అవి రావణ కుంభకర్ణులు. ఒకటి రజస్సు వేరొకటి తమస్సు. రెండూ రెండే. ఏమాత్రమూ తోడ్పడవవి సాధకుడికి. తోడ్పడక పోగా ఎంతైనా హాని చేయటానికి వెనుదీయవు.
ఇందులో రజో రాగాత్మకం. రాగమే ప్రధానం రజస్సుకు. రాగమంటే ప్రేమ అభిమానమనే గాదు. రంగని అసలైన శబ్దార్ధం. అంగరాగం ఓష్ఠరాగమనే పదాలలో వినిపిస్తుంటుంది. రంగు వస్త్రాని కంటుకొన్నట్టు అంటుతుందది మానవుడి మనస్సుకు. బట్ట కట్టిన రంగు దాన్ని గట్టిగా అంటుకొని ఎంత ఉతికి ఆరేసినా పూర్తిగా మాసిపోదు. అలాగే మనసులో ఈ రాగమనేది మొదట వృత్తి రూపంగా ప్రవేశించి తరువాత వాసనారూపంగా గట్టిపడి ఎంత కాదని త్రోసిపుచ్చినా తొలగిపోవట మసాధ్యం. ఇంగ్లీషులో దీన్ని Impresion అని పేర్కొంటారు. చాలా సాభిప్రాయమైన మాట అది Impress అంటే బాగా లోతుగా దిగిపోవటమని బాగా హత్తుకుపోవటమనీ అర్థం. వాసన అనీ సంస్కారమనీ పేర్లు దీనికి మన భాషలో. ఇంగువ కట్టిన గుడ్డ లాంటిది మనస్సు. ఇంగువ వాసన గుడ్డకు పట్టి అది ఖర్చయి పోయినా దాని అవశేష మెలా పోదో అలాగే ఇదీ.