ఇంతకూ ఈ మూడూ నిరుపయోగమే మనకు. ఉపయోగపడాలంటే తెలివనేది ఎప్పుడూ నిరాఘాటంగా ఉండాలి. అదీ నిశ్చలంగా ఉండాలి. అప్పుడది సత్త్వం కాదు. రజస్సు కాదు. తమస్సు కాదు. గుణాతీతమై సర్వ వ్యాపకమైన ఆత్మ చైతన్యమే. కాని మన దురదృష్ట మేమంటే ఈ గుణాలు మనల నాస్థితి నందుకోనీయవు. ఇవి మన తెలివిని కదలిస్తుంటాయి. తెలివి తప్పిస్తుంటాయి. లేదా మొద్దులాగా తయారు చేసి నిద్రలో పడేస్తుంటాయి. అవస్థాత్రయంలో జరుగుతున్న పనంతా ఇదే. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు సత్త్వగుణం మిగతా రెండింటి కన్నా ఎంతో మేలు. రావణ కుంభ కర్ణుల లాంటివి రజస్తమస్సులైతే సత్త్వగుణం విభీషణుడి లాంటిది. రాక్షస వంశంలో పుట్టినా విభీషణుడు మహాత్ముడని పేరు తెచ్చుకొన్నట్టే సత్త్వం కూడా గుణ వంశంలోనే పుట్టినా ఉత్తమమైన గుణం. కారణం. మిగతా రెండూ శరీర ప్రాణాలకు చెందినవైతే సత్త్వం మనస్సుకు సంబంధించిన గుణం.
మన ఏవ మనుష్యాణా మన్నట్టు మనస్సే ఇటు బంధానికి గానీ అటు మోక్షానికి గానీ ఏకైక సాధనం. ప్రాపంచికమైన భావాలు మనసుకే కలుగుతుంటాయి. పారమార్థికమైన వృత్తి కూడా మనసుకే ఏర్పడవలసి ఉంటుంది. జ్ఞానానికి నిలయమే గదా మనస్సంటే. అది ఎప్పుడూ వృత్తి రూపమా జ్ఞానం. జ్ఞానమే ప్రమాణమే విషయాన్నైనా గ్రహించటానికీ