#


Index

గుణత్రయ విభాగ యోగము

గుణాలు వాణ్ణి దేహంలో కట్టిపడేశాయని ఎలా పేర్కొన్నాడని ఆక్షేపణ వస్తే దానికి కూడా సంజాయిషీ ఇస్తున్నారు భాష్యకారులు. పరిహృత మస్మాభిః ఇవశబ్దేన నిబధ్నం తీవ అని. బంధించటం కాదు బంధించినట్టు కేవల మొక భ్రమే నని మేము దానికి పరిహారం చెప్పాము గదా అంటారాయన.

తత్ర సత్త్వం నిర్మలత్వా- త్ప్రకాశక మనామయం
సుఖ సంగేన బధ్నాతి - జ్ఞాన సంగేన చానఘ - 6

  కాబట్టి భ్రమ వదలనంత వరకూ సంసార బంధం తప్పదు. ఆభాసగా కనిపించ వలసిన గుణాలు వాస్తవమనే రంగు పూసుకొని నిన్ను ఖంగు తినిపిస్తాయి. సత్త్వం రజస్సు తమస్సనే ఈ మూడు గుణాలూ ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మనస్సు సత్త్వం - ప్రాణం రజస్సు - శరీరం తమస్సు. తెలివి తేటలుంటాయి. అయినా కదులుతుంటుంది మనస్సు. అందుకే అది సత్త్వగుణం. తెలివి లేదు. కాని కదలుతుంటుందెప్పుడూ. అందుకే అది రజో గుణం. పుట్టినప్పటి నుంచీ చచ్చే దాకా అనుక్షణమూ ఉచ్ఛ్వాస నిశ్శ్వాస రూపంగా చలించవలసిందే గదా ప్రాణం. మనసైనా గాఢనిద్రలో పనిచేయ దేమోగాని ప్రాణం చేయకుండా పోదు. పోతే ఇక మనసులాగా తెలివీ లేదు. ప్రాణంలాగా కదలికా లేదు. మొద్దులాగా పడి ఉంటుంది శరీరం. అందుకే ఇది తమో గుణమీ శరీరం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు