బంధాన్ని అనుభవిస్తున్నాము గదా అంటే దానికేమి. పడేయడ మెలా అబద్ధమో మన అనుభవించటం కూడా అబద్ధమే. ఆభాస అన్నప్పుడది నిజమెలా అవుతుంది. స్వప్నంలో ముగ్గురు దొంగలు మనలను తరుముకొని వచ్చి ఒక పాడుబడ్డ నూతిలో కట్టి పారేశారనుకోండి. స్వప్నం చూస్తున్నంత వరకూ వారు తరుముకు రావటమూ నిజమే. కట్టి బావిలో పారేయటమూ నిజమే. కాని తెల్లవారి మెలకువ వస్తే ఆ దొంగలూ లేరు. ఆ కూపమూ లేదు. మనల నందులో తెచ్చి పారేయటమూ లేదు. మనం కేకలు పెట్టటమూ లేదు. అంతా వట్టిదే. మెలకువ రానంత వరకే అది నిజం. మెలకువ వస్తే అంతా హుళక్కే
అలాగే గౌడపాదులు చెప్పినట్లు అనాది మాయ యా సుప్తః ఎన్నో జన్మల నుంచీ అజ్ఞానమనే దీర్ఘ నిద్ర పోతూ ఈ దేహమనీ ప్రపంచమనీ ఒక బ్రహ్మాండమైన స్వప్నాన్ని చూస్తున్నాము మనం. చూస్తున్నంత వరకూ ఇదే వాస్తవం మన పాలిటికి. యదాజీవః ప్రబుధ్యతే. మరలా ఏ జన్మకో జ్ఞానోదయమైతే చాలు. అప్పుడిదంతా ఆభాస అని తేలిపోతుంది. అందుకే చూస్తున్నా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నది గదా అని నీవెంత నమ్ముతున్నా ఇది శాస్త్రజ్ఞు లాభాసే నని గట్టిగా చెప్పటం మనకు. ఈ దృష్టితోనే భగవత్పాదులు నిబధ్నం తీవ. అవి నిన్ను బంధించటం లేదు వాస్తవంగా. బంధించినట్టు నీవు భ్రాంతి పడుతున్నావంటారు.