సత్త్వం రజస్తమ ఇతి - గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయమ్ - 5
అయితే ఇప్పుడు చెప్పండి. ఈ గుణాల వల్ల గదా ఇంత పని జరిగింది. వీటివల్ల గదా మనమీ సంసార సాగరంలో తల్లక్రిందులుగా వచ్చి పడ్డాము. తలమునకలయి పోతున్నాము. ఈశ్వర సాయుజ్యానికి నోచుకోకుండా చెడిపోయాము. అసలన్ని అనర్ధాలకూ మూల కారణమైన ఈ గుణాలనే వేమిటి. ఇది మనల నెలా కట్టిపడేశాయని ప్రశ్న వస్తే సమాధాన మిస్తున్నాడు మహర్షి.
సత్త్వం రజస్తమ ఇతి గుణాః గుణా ఇతి పారిభాషికః శబ్దః నరూపాదివత్ ద్రవ్యాశ్రితాః గుణాః - గుణాలంటే ఇవి తెలుపూ నలుపూ పొడుగూ పొట్టి లాంటి గుణాలు కావు. అవన్నీ ఒకానొక ద్రవ్యాన్ని Qualities or Properties. ఇవి అలాంటివి కావు. పారిభాషిక మంటారు భగవత్పాదులు. ఆధ్యాత్మ శాస్త్రంలో సాంకేతికంగా వాడే మాటలు Technical Terms. అంతే కాదు. గుణానికీ ద్రవ్యానికీ అన్యత్వం చెప్పటం కూడా కాదు మహర్షి ఉద్దేశం. మరేమిటంటారు. లోకంలో గుణాలన్నీ ఎలా వాటి ద్రవ్యాన్ని ఆశ్రయించి వాటికి పరాధీనమై ఉంటాయో అలాగే నిత్య పరతంత్రాః. క్షేత్రజ్ఞం ప్రతి క్షేత్రజ్ఞుడైన ఈ జీవుణ్ణి ఆశ్రయించి నిబధ్నంతి దేహే. శరీరంలో