అది వరేణ్యమైన ఆలోచన. యద్భావ స్తద్భవతి అన్నారు. అదే అయిపోతావు నీవు. అది కేవల జ్ఞాన స్వరూపం. కాబట్టి నిరాకారం నిర్గుణం. అది మా స్వరూపమే. అదే నీ స్వరూపం కూడా. అప్పుడు మాలాగే నిన్ను కూడా ఈ గుణాలు బాధించవు. మాలాగే నీవు వీటిని వశంలో ఉంచుకొని ఈశ్వరత్వ మందుకో గలవు. ముక్తుడవయి నిత్యానంద మనుభవించగలవు. ఇదీ మనః ప్రాణ రూపంగా మనలో జేరి నిత్యమూ మనకా తల్లిదండ్రులిద్దరూ నిశ్శబ్దంగా చేసే ప్రబోధం. అందుకొంటే ధన్యులం. లేకుంటే జఘన్యులం.
అన్నిటికన్నా ఆశ్చర్యమేమంటే అందుకొనే ఉన్నాము. ఇప్పుడూ మనం ముక్తులమే. ఎలాగంటే అమ్మా అయ్యా అని పేరే గాని వేరే కారు వారిద్దరూ. ఇద్దరుగారు ఒకరే. నిమిత్తోపాదానాలు రెండు గావు. ఒకటేనని వేదాంతుల సిద్ధాంతం. సచ్చిత్తులు రెండూ ఏకమే. అది దేనినీ క్రొత్తగా సృష్టించలేదు. హిరణ్య గర్భుడూ లేడు. దేవ పితృ మనుష్య పశుపక్ష్యాది జీవులూ లేరు. నిర్జీవమని భావించే జగత్తూ లేదు. ఇదంతా ఆ సచ్చిత్తత్త్వ మేదుందో దాని తాలూకు ఆభాసే. వస్తువుగాదు. వస్తువది ఒక్కటే. అదే ఇన్ని భూమికలలో ఇన్ని వేషాలు వేసుకొని కనిపిస్తున్నది. కాగా ఈ వేషాలన్నీ అదే గదా అని దానిలో కలుపుకొని చూడగలిగితే వాడు గుణాతీతుడైన బ్రహ్మవేత్త. అలా కలుపుకోలేక వేషధారిని మరచి దూరం చేసుకొని ఈ వేషాలే చూస్తూ కళ్లు తిరిగి ఇందులోనే పడి బ్రతుకుతుంటే వాడు గుణాధీనుడు. సంసార బద్ధుడు. ఇదీ అసలు కధ. మానవుడి జీవిత కథ.