#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఇంద్రియాలూ - మొత్తం జీవుడి ఉపాధులన్నీ కలిసి వచ్చాయి. అంటే పిండాండమంతా దీనితో నిశ్శేషమయింది. పోతే దీన్ని నేనే నా స్వరూపమే నని అభిమానిస్తూ బ్రతికే జీవచైతన్యం మాత్రమే శేషించిన పదార్ధం. అది దీనికి విజాతీయం గనుక దీని క్రిందికి రాదు. ఇది అపర అయితే అది పర.

  పోతే ఇలా పిండ శరీరంగానే గాక బ్రహ్మాండ శరీరంగా కూడా పరిణమించిందీ అపరా ప్రకృతి. దానికే విషయమని పేరు. కార్యకరణాల వరకూ మనబోటి జీవుల శరీరమైతే విషయమనేది హిరణ్యగర్భుడి శరీరం. ఇది పిండాండమైతే Micro అది బ్రహ్మాండం Macro. రెండింటినీ కలిపి కార్యకరణ విషయాకారేణ పరిణతం అని ఒక్క మాటలో సంగ్రహంగా సెలవిచ్చారు భగవత్పాదులు. మొత్తం మీద మనః ప్రాణాధికమైన మన శరీరం దగ్గరి నుంచీ బాహ్యంగా కనిపించే ఈ అండ పిండాత్మకమైన విశ్వ శరీరం దాకా రెండూ శరీరాలే. రెండూ పాంచ భౌతికమే. అపరా ప్రకృతి వికారాలే రెండూ. నిర్వికారమైనదీ మన జీవ చైతన్యమొక్కటే. అది సవికారం గనుక అపర అయితే నిర్వికారం గనుక ఇది పర. అచేతనం గనుక అది నికృష్టమైతే కేవల చైతన్యరూపం గనుక ఇది ఉత్కృష్టమైనదీ పరా ప్రకృతి. నికృష్టం గనుకనే అది జీవుడి పాలిటికి సంసారంగా మారి అది వీణ్ణి నిత్యమూ బాధిస్తున్నది. సహజంగా ఉత్కృష్టుడైనా దీని నభిమానిస్తున్న నేరానికి జీవుడు నిత్యమూ బాధపడుతున్నాడు.