కనిపిస్తున్నా ముగ్గురూ ఒకే ఒక తత్త్వం. కేవలం వారి వారి ఉపాధుల Media మూలంగానే విభాగ మేర్పడుతుంది.
పోతే ఈ కనిపించే జగత్తే చైతన్యానికి విజాతీయం. అది నిరాకారమైతే ఇది సాకారం. అది ఆత్మ అయితే ఇది అనాత్మ. అది చేతనమైతే ఇది జడం. ఇలాంటి మార్పు చోటు చేసుకోవటం వల్లనే జీవుడిలాగా సజాతీయం కాదిది విజాతీయం. విజాతీయం గనుక ఇది సృష్టి అయింది. సజాతీయం గనుక జీవుడిది ప్రవేశమయింది. విజాతీయ మెప్పుడయిందో అప్పుడది సజాతీయాన్ని బాధించి తీరుతుంది. అదే జీవుడికీ సంసార బాధలు. హిరణ్యగర్భుడికీ ఈశ్వరుడికీ కూడా ఇది విజాతీయమే గదా. వారినిది ఎందుకు బాధించదంటారేమో. వారు ప్రకృతిని తమ అదుపులో పెట్టుకొన్నారు కాబట్టి బాధించదు. అందులో 80 90 పాళ్లు వశంలో ఉంచుకొన్నది హిరణ్యగర్భ చైతన్యమైతే- నూటికి నూరుపాళ్లూ ఉంచుకొన్నదీ శ్వర చైతన్యం. ఎటు వచ్చీ అలా ఉంచుకోలేక బాధపడుతున్నదీ జీవ చైతన్యమే. అది పరిమాణంలోనే గాని గుణంలో ఇది కూడా చైతన్య స్వరూపమే గనుక ఈశ్వరుడికీ జీవుడికీ వస్తుతః తేడా లేదు.
కనుకనే ఈశ్వరుడి పరా పర ప్రకృతులు రెండింటిలో జీవుడిది పరా ప్రకృతి అయింది. జగత్తుది అపరా ప్రకృతి అయింది. కార్య కరణ విషయా కారంగా పరిణమిస్తున్నదీ అపరా ప్రకృతే. కార్యమంటే శరీరం. కరణమంటే మనః ప్రాణాలూ వాటి నౌకర్లయిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలూ. ఏమయిందప్పటికి. మనస్సూ ప్రాణమూ శరీరమూ