అన్యంగా ఉండడు. చైతన్యమే శక్తి. శక్తే చైతన్యం. అయితే అది ఒకచోట వ్యక్తమయి కనిపిస్తుందా చైతన్యం. మరొకచోట స్పష్టా స్పష్టంగా గోచరిస్తుంది. ఇంకొక చోట బాగా అస్పష్టమయి అసలుందా లేదా అనిపిస్తుంది. కాని స్ఫురించటమే చైతన్య లక్షణమను కొంటే చేతనా చేతనాలు రెండూ స్ఫురిస్తూనే ఉన్నాయిగదా. ఇక పరమాత్మ రూపం కాని దేముంది. ఈ జడచేతన శక్తులు రెండూ దగ్గర పెట్టుకునే ఉన్నదా తత్త్వం. అదే ఈశ్వరుడు. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ శక్తి మా నీశ్వరః అంటారు భగవత్పాదులు. వాడే అహం. నిమిత్త కారణం క్షేత్రజ్ఞుడు. పోతే వాడి శక్తి క్షేత్రం. అది ఉపాదానం. మమ. ఈ రెండింటి సంయోగం వల్లనే సృష్టి.
మొదట ఇద్దరూ కలిసి హిరణ్యగర్భడనే సమష్టి జీవుణ్ణి సృష్టించారట. హిరణ్యగర్భ జన్మనః బీజం సర్వభూత జన్మ కారణం అని భాష్యకారుల మాట. తరువాత హిరణ్య గర్భోత్పత్తి ద్వారేణ సంభవః ఉత్పత్తి స్సర్వభూతా నామని పేర్కొంటారాయన. వారివల్ల మొదట హిరణ్యగర్భుడైతే ఆహిరణ్యగర్భడి వల్ల తరువాత సమస్త భూతాలూ జన్మించాయట. ఎవడీ హిరణ్యగర్భుడు. సమష్టి ప్రాణమూ సమష్టి జ్ఞానమూ రెండూ కలిసిన ఒక వ్యక్తి. Cosmic Person హిరణ్యం గర్భంలో ఉన్నవాడు హిరణ్యగర్భుడు. హిరణ్యమంటే ప్రకాశానికి సంకేతం. చైతన్య ప్రకాశమది. జ్ఞానం. అది కదిలితే గాని సృష్టి జరగదు. కాబట్టి ప్రాణమవసరం దానికి. ఈ ప్రాణమే