నీ ప్రతిముఖమంటే ఆశ్చర్యపడతావు. జవాబు లేదు నీకు. నీ ముఖం నీదగ్గరే ఉంది. ఎక్కడా సంక్రమించ లేదు. అలాగే ఇక్కడా వాస్తవంగా జరగలేదు. జరిగినట్టు చేసినట్టు ఆభాస.
తస్మిన్ గర్భం దధామ్యహ మంటే ఆభాసగా ననే అర్ధం చేసుకోవాలి మనం. ప్రకృతిలో గర్భధారణ జరుగుతున్నది. అది ఉపాదానమైతే దానికి నిమిత్తం నేను. అహం బీజ ప్రదః పితా అని చెప్పబోతాడు కూడా. నేను తండ్రిని. తల్లి ప్రకృతి అంటాడు. లోకంలో లాగే అక్కడా. అయితే ఇక్కడ చాలా చిన్న మోతాదులో అయితే అక్కడ చాలా పెద్ద మోతాదులో. మరీ పెద్ద మోతాదయ్యేసరికి అక్కడ ఇద్దరికీ ఆకారం లేదు. తండ్రి అయిన పరమాత్మా నిరాకారమే. తల్లి అయిన మాయా శక్తీ నిరాకారమే. నిమిత్తమూ నిరాకారమే. ఉపాదానమూ నిరాకారమే. మరి రెండూ నిరాకార మయినప్పు డాయన బీజాన్ని నిక్షేపించటమేమిటి. ఈవిడ గర్భం ధరించటమేమిటి. లోకంలోనైతే తల్లీ తండ్రీ ఇద్దరూ సాకారులు కాబట్టి సంయోగమనేది ఏర్పడటం సహజమే. సంతాన మేర్పడటమూ సంభవమే. ఇక్కడ అలాకాదు గదా. తల్లిదండ్రులిద్దరూ నిరాకారులూ వ్యాపకులూ అయి కూచున్నారు. ఇక్కడ చరాచర సృష్టి ఎలా సంభవం. అసలు వారికి సంబంధ మెలా సాధ్యం. ఇది సంయోగ సంబంధం కాదు. సమవాయ సంబంధమూ కాదు. మరే సంబంధం.