గాక సధర్మత్వమని అర్థం చెప్పినా చెప్పవచ్చు. ధర్మేణ సహవర్తతే ఇతి సధర్మా - తస్యభావ స్సధర్మతా యద్వా సాధర్మ్యం. తన ధర్మంతో తాను కలిసి ఉండటమే సాధర్మ్యం. ధర్మమేమి టిక్కడ. ధర్మం గాని ధర్మం. మాయా శక్తి. అది ఎప్పుడూ పరమాత్మ నంటి పట్టుకొని అవినాభావంగా ఉంటుంది. ఆయన శక్తి అది. ఆయనకు సంకల్పం కలగనంత వరకూ అది అవ్యక్తం. కలిగిందంటే నామరూపాత్మకంగా వ్యక్తమయి కనిపిస్తుంది. దానితో నిర్గుణమైన పరమాత్మ సగుణమై అవతరిస్తాడు. సంభవామ్యాత్మ మాయయా అని తానే గదా చాటించాడు. అయితే తన శక్తి తన కధీనమయి ఉంటుంది కాబట్టి అది ఆయనకు జన్మగాని జన్మ. మరణం గాని మరణం. జనన మరణా లాభాసే గాని పరమాత్మకు వాస్తవం కావు. అలాగే పరమాత్మ స్వరూపుడైన ముక్తపురుషులు కూడా సర్గేపి నోపజాయంతే. జన్మ ఎత్తినా అది జన్మ కాదు. ప్రలయే న వ్యధంతి చ. మరణించినా అది మరణం కాదు. పరమాత్మ మాదిరే వారూ ఒక ఉపాధితో అవతరిస్తారు. చేయవలసిన పని సమాప్తం కాగానే ఉపాధి నిక్కడే వదిలేసి పోతారు. పరమాత్మ అవతారమే వారి అవతారం. పరమాత్మ నిర్యాణమే వారి నిర్యాణం. పరిపూర్ణమైన అద్వైతానుభవమిది. ఇక్కడ ఆక్షేప సమాధానాలకు తావు లేదు. ఆత్మ తప్ప వేరొక పదార్ధముంటే గదా ప్రశ్నోత్తరాలు. సర్వమూ ఆత్మ చైతన్యమే అయినప్పుడిక రాకపోకల కర్థమేముంది. అయినా వచ్చినట్టు