ధర్మాలు. అవి సామాన్యాన్ని విడిచి ఎక్కడా ఉండవు. జలాన్ని విడిచి తరంగ బుద్బుదాదులుండ గలవా. అలాగే ఇక్కడా.
అంతేకాదు. ముక్తుడైన మానవుడు పరమాత్మ స్వరూపుడు కావటమొక సిద్ధి అయితే పరమాత్మలాగా సాక్షి అయి ఉండటం మరొక సిద్ధి. దేనికి సాక్షి. సర్గేపి నోపజాయంతే. ప్రలయే న వ్యధంతిచ. లోకాలన్నీ సృష్టి అవుతున్నా తాను సృష్టి కాడు. అవన్నీ లయమవుతున్నా తాను లయం కాడు. సాక్షి అన్నప్పుడు సృష్టి ప్రలయాలు లేవు వాడికి. అంటే జనన మరణాల ఉపద్రవం లేదతనికి. పరమాత్మ కున్నాయా ఇప్పుడవి. అలాగే తానూ పరమాత్మ స్వరూపుడే కాబట్టి జనన మరణాలు తాను పొందకుండా మిగతా జీవరాసులు రాకపోకలు చేస్తుంటే సాక్షిగా చూస్తుంటాడు. ఒక మార్కండేయుడి లాగా ఒక నారద మహర్షిలాగా బ్రహ్మకల్పాలెన్ని గడిచిపోతున్నా వాటిని గమనిస్తూ కూటస్థంగా ఉండిపోతాడు.
అయితే రామకృష్ణా ద్యవతారాల మాటేమిటి. వారు పరమాత్మ స్వరూపులు కారా. పరమాత్మే గదా ధర్మ సంస్థాప నార్ధ మలా అవతరించానని చెప్పాడింతకు ముందు. ఇది మంచి ప్రశ్నే. దీనికి సమాధానం మహర్షి ప్రయోగించిన మాటలోనే అంతర్లీనంగా దాగి ఉంది. సాధర్మ్యమనే మాటకు స్వరూపమని గదా అర్ధం చెప్పాము. స్వరూపమనే