#


Index

గుణత్రయ విభాగ యోగము

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞాన ముత్తమం
యద్ జ్ఞాత్వా మునయ స్సర్వే - పరాంసిద్ధి మితో గతాః - 1

  అర్జునా. నీవు అడగక పోయినా నీకు నేను మరలా అదే పనిగా బోధ చేస్తున్నాను. విను. ఇది ఇంతకుముందు అధ్యాయాలలో అక్కడక్కడా ప్రస్తావించి ఉండవచ్చు. అయినా పరం జ్ఞానం. చాలా గొప్ప విజ్ఞానమిది. కారణం. పరవస్తు విషయత్వాత్- పరమార్ధానికి సంబంధించినది. మరి ఎన్నో ఉన్నాయి గదా జ్ఞానాలు దీని గొప్పేమిటంటావా. జ్ఞానానాం జ్ఞాన ముత్తమం. జ్ఞానాలన్నింటిలో ఉత్తమమైన జ్ఞానమిది. ఎంచేత. ఉత్తమ ఫలత్వా తంటారు భగవత్పాదులు. ఉత్తమమైన మోక్ష ఫలాన్నే ఇస్తుందిది. అయితే మిగతా జ్ఞానాలేవీ ఇవ్వవా. ఇవ్వవు. ఇవ్వలేవు కూడా. యజ్ఞాది జ్ఞేయ వస్తు విషయాణామని ఒక్క మాటలో కొట్టివేశారు భాష్యకారులు. జ్ఞేయ వస్తువులకు సంబంధించినదే మన మార్జించే ఏ జ్ఞానమైనా. అది లోకమైతే లోక జ్ఞానం. శాస్త్ర విషయమైతే శాస్త్ర జ్ఞానం. సంగీత సాహిత్యాది విషయకమైతే కళాజ్ఞానం. కడకు యజ్ఞయాగాది విషయమైతే ధర్మజ్ఞానం. అన్నీ మనకు భిన్నంగా గోచరించే అనాత్మ జగత్తుకు చెందినవే Objec-tive Knowledge. అంతేగాని మన స్వరూపానికి సంబంధించినవి కావు. చైతన్యమే మన స్వరూపమదే ఆత్మ. అది దేశకాలాదులనే హద్దులు లేకుండా సర్వత్రా వ్యాపించినది. మిగతావన్నీ విశేషాలైతే అది సామాన్యం. దానికి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు