మన మనస్సు. వీటిలో బందీ అయిన జీవుడనే ఈ క్షేత్రజ్ఞుడు ఒకానొక క్షేత్రం మేరకు ఆగిపోయి ఈశ్వరుడిలాగా సర్వక్షేత్రాలనూ వ్యాపించ లేక పోతున్నాడు. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఈ గుణ సంపర్కమే జన్మ పరంపర కంతటికీ కారణమయి కూచుంది. ఇదే సంసార బంధం మానవుడికి.
మరి ఈ సమస్యకు పరిహారమేమిటి. ఈ గుణాలనే పద్మవ్యూహంలో నుంచి బయటపడే మార్గమేమిటని అడిగితే ఒక్క మాటలో సూచన చేసింది క్షేత్రజ్ఞాధ్యాయం చివర ఫలశ్రుతి వ్యాజంతో. క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవ మంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ యే విదుః అని క్షేత్రం నుంచి క్షేత్రజ్ఞుడి స్వరూపాన్ని ఇద మిత్థమని విడగొట్టి చూడాలట. ఇదే ఆత్మానాత్మ వివేచన. సత్త్వ రజస్త మస్సులనే గుణాలు మూడింటినీ తన మీద వేసుకొన్న వాటిని మరలా ప్రకృతికే అప్పజెప్పి తాను పరిశుద్ధ చైతన్య రూపుడు గానే మిగిలిపోవాలట జీవుడు. భూత ప్రకృతి మోక్షం కూడా అప్రయత్నంగా సిద్ధిస్తుందప్పుడు. సిద్ధిస్తే ఇక జీవుడు కాడు. వీడీశ్వరుడే. శుద్ధ చైతన్య స్వరూపుడు కాబట్టి ఈశ్వరుడిలాగా సర్వజగత్తునూ నిరుపాధికంగా వ్యాపించ గలడు. అదే సంసార బంధం నుంచి విముక్తి వీడికి.
ఇప్పుడీ ప్రకృతి గుణాలేమిటో వీటితో సాంగత్యమీ జీవుడికెలా ఏర్పడిందో వీటి బారి తప్పించుకొని వీడెలా బయటపడాలో ఆ మార్గమేమిటో ఇదంతా తానుగా విమర్శించుకొని అడిగి తెలుసుకోవాలనే జిజ్ఞాసా ఓపికా అర్జునుడికి లేదని తెలుసు కృష్ణ పరమాత్మకు. అందుకే అతడడిగినా అడగకున్నా తానే స్వయంగా అతని కా విషయమంతా బోధిస్తున్నాడు.