లవుతున్నారే గాని సాంఖ్యులు చెప్పినట్టు తమ పాటికి తాము స్వతంత్రంగా కాదని చెప్పటానికి కూడా.
ఇంకా ఒక విశేషముంది ఈ అధ్యాయం ప్రారంభించటానికి. ప్రకృతి స్థత్వం గుణేషుచ సంగః సంసార కారణ మిత్యుక్తం. ప్రకృతితో తాదాత్మ్యం చెంది దాని గుణాలలో తగులుకోటం వల్లనే జీవుడికీ సంసార బంధమని చెప్పాము. కస్మిన్ గుణే కధం సంగః కేవాగుణాః కధం వా తే బధ్నంతి - గుణేభ్యశ్చ మోక్షణం కధం స్యాత్ - ముక్తస్యచ లక్షణం వక్తవ్య మిత్యేవ మర్ధంచ. ఏ గుణంలో ఎలా బందీ అయ్యాడీ జీవుడు. అసలా గుణాలేమిటి. ఎలా బంధిస్తాయవి వాటి నుంచి మానవుడెలా బయటపడి ముక్తుడవుతాడు. ముక్తుడైన వాడి లక్షణమెలా ఉంటుంది. ఇలాటి సూక్ష్మాలన్నీ తెలపటానికి కూడా ప్రారంభించాడీ అధ్యాయం వ్యాసభగవానుడు.
ఇంతకూ ఏమిటి దీని సారాంశం. పరా పర ప్రకృతులకే క్షేత్ర క్షేత్రజ్ఞులని పేరు. పర జీవుడైతే అపర జగత్తు. ఇందులో అపర మనలను సంసార బంధంలో పడదోస్తుంది కాబట్టి నికృష్టమయింది. పోతే పర చేతనాత్మకమైనది కాబట్టి ఉత్కృష్టమయింది. అదే జీవుడు. వీడు ఈశ్వరుడి లాగా చేతనుడయి కూడా అజ్ఞానవశాత్తూ అచేతనమైన అపరా ప్రకృతినే తన స్వరూపంగా అభిమానించి దాని గుణాలలో పడిపోయాడు. దానివల్లనే శరీర మనః ప్రాణాలనే ఉపాధులు చుట్టుముట్టి వీణ్ణి మూడు తాళ్లతో చుట్టి కట్టి పడేశాయి. గుణమంటే తాడని కూడా అర్థమే. అందులో తమో గుణ వికారమే శరీరం. రజోగుణాత్మకం ప్రాణం. కాగా సత్త్వగుణ సంబంధి