చిత్తు శివ స్వరూపం. సత్తు శక్తి స్వరూపం. శివుణ్ణి విడిచి శక్తి లేదు. శక్తిని విడిచి శివుడు లేడు. అంటే ఏమని అర్థం. శివశక్తులంటే జ్ఞాన క్రియాశక్తులు . ప్రమాణ ప్రమేయాలు. స్వరూప విభూతులు. రెండూ ఒకే ఒక తత్త్వం. చెప్పటానికి ద్వైతం. చూడటాని కద్వైతం. అంత మాత్రమే.
కనుకనే అద్వైతంగా రెండింటినీ కలుపుకొని చూడాలే గాని ద్వైతంగా విడదీసి చూడరాదు. అదే చెబుతున్నా డిప్పుడు. క్షేత్ర క్షేత్ర జ్ఞయోరేవ మంతరం. ఆత్మానాత్మలకు లేదా శివశక్తులకు లేదా స్వరూప విభూతులకు రెండింటికీ అంతరం. తేడా ఉన్నట్టు నీవు చూస్తావేమో. మామూలు చూపుతో చూస్తే నీకలాగే కనిపించవచ్చు. కానీ నీవలా చూడకు. జ్ఞాన చక్షుషా. జ్ఞానదృష్టితో చూడు. అంటే రెండూ వేరుగావు ఒకటేననే అద్వైత దృష్టితో చూడు. అలా చూచావంటే భూత ప్రకృతి మోక్షంచ. సమస్తభూత సృష్టికీ ఏది మూలభూతమో అలాటి అవిద్యా లక్షణమైన ప్రకృతి బంధం నుంచి బయటపడతావు. భూత ప్రకృతి అంటే అవిద్య అనే అర్థం వ్రాశారు భాష్యకారులు. అవిద్య అంటే అజ్ఞానం. జ్ఞానం లేకపోవటం. ఏ జ్ఞానం. అంతా ఆత్మస్వరూపమే ననే అద్వైత జ్ఞానం. అంతా అన్నప్పుడాత్మ అనాత్మ అనే తేడా ఏముంటుంది. రెండూ ఒకే ఒక తత్త్వంగా అనుభవానికి రావలసి ఉంది. అలాగైతేనే అది మోక్షం. అనాత్మ భావమే గదా బంధం. అది కూడా ఆత్మగా నీవు భావించినప్పుడే బంధ విముక్తి.