తప్పకుండా ఉందనే నమ్మాలి ఇందులో కూడా. అంతేకాదు. అంతటా ఉన్నా ఆ చిదాకాశ రూపమైన ఆత్మ కెలా ఏదీ అంటదో అలాగే దేహంలో ఉన్న దానికి కూడా ఏదీ అంటకూడదు వాస్తవంలో. తధా ఆత్మా నోపలిప్యతే. అయినా కర్తృత్వ భోక్తృత్వాది దోషాలు దానికి సోకుతున్నట్టు నీవు భావిస్తున్నావంటే అది వాస్తవంగా కర్తా భోక్తా అయిగాదు. నీవు దాని నలా భావించటం వల్ల. ఈ భావనే ఆభాస అనే మాట కర్ధం. ఏది వాస్తవంగా జరగటం లేదో అయినా జరిగినట్టు భావిస్తుందో అదేగా ఆభాస అంటే.
యధా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమంరవిః
క్షేత్రం క్షేత్రీ తధా కృత్స్నం- ప్రకాశయతి భారత - 33
ప్రస్తుత మీ అద్వైత సత్యమే మన మనస్సులో బాగా బలపడటానికి మరొక దృష్టాంతం కూడా ఇస్తున్నారు. అది ఆకాశ దృష్టాంతమైతే ఇది రవి దృష్టాంతం. రవి అంటే సూర్యుడు. ఆకాశానికీ సూర్యుడికీ తేడా ఏమంటే అది వెలుగు లేని శూన్య పదార్థం. ఇది వెలుగున్న పూర్ణ పదార్ధం. శూన్యం జడానికీ వెలుగు చేతనానికీ సంకేతం. ఇక్కడ ఆకాశమనేది ఆత్మకున్న సద్భాగానికి దృష్టాంతమైతే సూర్యమండలం దాని చిద్భాగానికి దృష్టాంతమని భావించవచ్చు. సత్తు సత్తుగా ప్రకాశించ లేదు. అది ప్రమేయమే గాని ప్రమాణం కాదు. ప్రమాణం దానికి చిత్తు. అది స్వయం