జ్ఞానం. ఇందులో వృత్తి రూపంగా నీ జ్ఞానం జాగ్రత్స్వప్నాలలో దర్శనమిస్తే సుషుప్తిలో వాసనారూపంగా నీలో కలిసి ఉంది. అయినా ఆ వృత్తులూ నీ జ్ఞానం కావు. ఆ వాసనా నీ జ్ఞానం కాదు. దానికున్న దెప్పుడూ అది గాదు.
అలాటి జ్ఞానమే ఇప్పుడు నీకున్న జ్ఞానం. వృత్తి వాసనా రహితమైన జ్ఞానమెక్కడో గాదు. నీలోనే ఉంది. నీ స్వరూపమే. అనవసరంగా నీ జ్ఞాన మా వృత్తులే నని ఆ వాసనలేనని వివేచన చేయక చూడటం వల్ల నీవా మేరకు పడిపోయి నీవు జీవుడవనీ నీకు భిన్నంగా ఒక ఈశ్వరుడెక్కడో ఉన్నాడని భ్రాంతి పడుతున్నావు. అలాటి భ్రాంతి లేకుంటే ఈశ్వరుడవు నీవే. ఇప్పుడు నీ శరీరంలో ఉన్న జ్ఞానమేదో గాదు. అది ఈశ్వరుడే సాక్షాత్తూ. కనుకనే శరీర స్టోపి కౌంతేయ. శరీరంలోనే ఉన్నా అది వస్తుతః సర్వత్రా ఉన్న జ్ఞానమే. అందుకే నకరోతి నలిప్యతే అని కితాబిస్తున్నది నీకు శాస్త్రం. శరీరంలో ఉన్నా నీవీశ్వరుడవే గనుక ఈశ్వరుడిలాగా నీవీ ఉపాధిలో అంటిముట్ట కుండా బ్రతుకుతుంటావు. ఒక పనిచేయటమూ లేదు నీవు. చేసి దాని ఫలిత మనుభవించటమూ లేదు. అయితే ఈ పనీ ఆ పనీ చేస్తున్నది నేను గాదా. సుఖదుఃఖాలను భవిస్తున్నది నేను గాదా అని