ప్రయాణిస్తుంటుంది. తరంగమలా నడుస్తున్నా అది ఆ జలం తాలూకు ఆ భాసే గాని దానికి భిన్నంగా ఒక వస్తువుగాదు. కాని పడవ మాత్రం దానికి భిన్నమే గనుక జలాని కాభాస గాదు. అది వస్తువు. ప్రస్తుత మీ జ్ఞేయ ప్రపంచం పడవలాగా అన్యమైనది గాదు జ్ఞానానికి. జ్ఞానం తాలూకు ఆభాస అంటారు శాస్త్రజ్ఞులు. అంటే అఖండ జ్ఞాన స్వరూపమైన ఆత్మే అప్పటి కనాత్మ ప్రపంచంలాగా భాసిస్తున్నదన్న మాట.
దానికి కారణ మా ఆత్మ స్వరూపంలోనే అంతర్గతంగా ఉన్న ప్రకృతే నంటారు. ప్రకృతి అంటే స్వభావమని అర్థం. దాన్ని తన జ్ఞాన బలంతో వశం చేసుకొని సృష్టి స్థితి లయాలు సాగిస్తే అది ఈశ్వరుడు. దానికే తాను వశమై నేను అల్పజ్ఞుడనూ అల్పశక్తుడనూ అని భావించి సాంసారికమైన కష్ట సుఖాలను భవిస్తూ పోతే వాడు జీవుడు. ప్రకృతి నా కనన్యమనే జ్ఞానమున్న వాడీ శ్వరుడైతే అన్యమనే అజ్ఞానంతో సతమత మయ్యేవాడు జీవుడన్న మాట. ఇదుగో ఈ అజ్ఞాన మున్నంత వరకూ వాస్తవంలో ఈశ్వర స్వరూపుడే అయినా ఆ ఈశ్వరుణ్ణి తన కన్యంగా దూరంగా భావిస్తుంటాడీ జీవుడు. అప్పుడు వీడికి వాడు వాస్తవంగా అన్యం కాకున్నా అన్యంగానే పరోక్షంగానే కనిపిస్తుంటాడు. వాడే గాక వాడి ప్రకృతి కూడా వీడి కన్యమయి పోతుంది. కాగా ఆ ఈశ్వరుడీ ప్రకృతి ద్వారా జ్ఞేయమైన ఈ ప్రపంచం మీదా జ్ఞాత అయిన జీవుడి మీదా ఇద్దరి మీదా