పోతే ఇప్పుడొక ప్రశ్న. మీరు చెబుతున్న సిద్ధాంతం చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది. మన అనుభవం చూస్తే మాత్రం భయమేస్తుంది. సర్వమూ ఆత్మే. అనాత్మగా చూచే ఈ దేహేంద్రియాదులు కూడా ఆత్మేనని గదా చాటి చెబుతున్నారు మీరు. కాని అది సిద్ధాంతమే నేమో. అనుభవానికి రాదేమోనని మా అనుమానం. మానవుడి స్వానుభవానికి రానంత వరకూ అది ఎంత శాస్త్రమైనా ఎంత గురూపదేశమైనా నమ్మక మేర్పడదు మానవుడికి. అనుభవంలోనే వస్తుంది నమ్మకమనేది. లౌకికమైన విషయాలలోనే ఇలా ఉంటే అన్నిటికన్నా అతీతమైనదీ అద్వైత విజ్ఞానం. ఇది మనకంతా ఆత్మ స్వరూపమేనని బోధిస్తున్నదంటే అనుభవానికి రావాలి గదా. రావాలని కూడా కాదు. అస లనుభవం లోనే ఉండి తీరాలి. అదీ జ్ఞానమున్న ప్రతీవాడికీ. ఎందుకంటే జ్ఞానమే అనుభవం. అది మరలా ఆత్మ స్వరూపమే. అలాంటప్పుడీ దేహేంద్రియాదులు మన కా భాసగా గదా కనపడవలసింది. అలా కాక వాస్తవంగానే కనిపిస్తూ మనలను తమలో బందీ చేసి బాధించటమనేది ఎలా జరిగింది. అలాగే గదా మనందరి అనుభవమూ ఇప్పుడు. అలాంటప్పుడీ అనుభవాన్ని కాదని మేము చెప్పేదే అసలు వాస్తవమైన అనుభవమని శాస్త్రమెంత ఘోషించినా ప్రయోజన మేముంది. అది వట్టి అరణ్య రోదనమే గదా అని ప్రశ్న. దానికి సమాధాన మిస్తున్నాడిప్పుడు మహర్షి.