చూస్తే భేద దృష్టి. అలా కాక నాది కూడా నేనేనని చూస్తే అభేద దృష్టి. సచ్చిత్తులే గదా నేనంటే. అవే నాదనుకొనే ప్రపంచంలో కూడా కనిపిస్తున్నాయి గదా. ఇక నేను గాని నాది ఎక్కడ ఉంది. లేదు వాస్తవానికి. కాని అలా చూడాలి ఎటు వచ్చీ. అది ఒక్కటే షరతు. ఆ ఒక్కటీ పాటించామంటే చాలు. అంతా ఆత్మమయమే. అనాత్మ గంధం కూడా కనపడదు.
ఈ రహస్యమే మనకీ శ్లోకమిప్పుడు బయటపెడుతున్నది. యదా భూతపృధ గ్భావం. ఎప్పుడైతే చరాచర పదార్థాలూ నీకు వేర్వేరుగా కనపడుతుంటే వాటన్నిటినీ ఏకస్థ మనుపశ్యతి. ఒకే ఒక చోట చేర్చి చూడగలవో అంటాడు. వేర్వేరంటే దేనిపాటికది విశేషంగా కనపడటం. పట్టణం పర్వతంగాదు. పర్వతం సముద్రం గాదు. సముద్ర మరణ్యం గాదు. ఇలా చిత్ర విచిత్రంగా విస్తరించి ఉన్నదీ అనాత్మ ప్రపంచం. అయినా ఇంత అనేకత్వం పైకి కనిపిస్తున్నా ఏకైకమైన తత్త్వమొకటి పరుచుకొని ఉన్నది వీటిలో. అదే సదాత్మకమైన స్ఫురణ. Ever Present consciousness. ఈ అనేక మంతా ఆ ఏకంలో చేరిపోవలసిందే. సముద్రంలో తరంగాలలాగా దానిపాటి కది చేరే ఉన్నదా మాటకు వస్తే. వస్తుసిద్ధమైనా అది మనకు బుద్ధి సిద్ధం కావటం లేదు. అదే అలవరుచుకో