ఇంతెందుకు. రెండూ విడివిడిగా కూడా కాదు. ఒకటి మనకు శత్రువని దాన్ని తప్పించుకోనక్కర లేదు. వేరొకటి మనకాప్తుడని దాన్నే వాటేసుకొని ್కూచోనక్కర లేదు. ఎందుకంటే పరమాత్మకు ప్రకృతి అనేది ఏదో పరాయిది గాదు. ఆయన ప్రకృతే. అంటే ఆయన స్వభావమే. ఆయన శక్తి ఆయనకు అన్యమెలా అవుతుంది. మత్తః పరతరం నాస్తి అని స్వయంగానే చాటి చెప్పాడు గదా. మమ ప్రకృతి ర్మమ మాయా అని స్పష్టంగా చెబుతున్నాడు గదా. అలాంటప్పుడు మన డ్యూటీ ఏమిటి. ప్రకృతి వేరు పరమాత్మ వేరని చూడరాదు. మరేమిటంటారు. నాకూ పరమాత్మకూ తేడా లేదని శాస్త్రం హామీ ఇస్తున్నప్పుడిక ఆ ప్రకృతి ఏమవుతుంది మనకు. మన స్వభావమే మన శక్తే అవుతుంది. మనకిక భయమేమిటి. అయ్యో ప్రకృతి గుణాలే అవి మనలను బంధిస్తాయే ఈ సంసార గహ్వరంలోకి త్రోసి పారేస్తున్నాయే అని హడలిపో నవసరం లేదు. పరాయిగా గాక అది కూడా మన స్వరూపమే మనం వాస్తవమైతే అది మన విభూతి అని అర్థం చేసుకోవటం మంచిది. మనజ్ఞాన మొక మహాసాగర మనుకొంటే అది దాని నుంచి పైకి పొంగే తరంగాలూ బుద్బుదాలూ ఆవర్తాలూ ఫేనాలూ అనుకొంటే సరిపోతుంది. మన చైతన్య విస్తారమే త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచ మని అభేద దృష్టి నలవరుచుకొని చూస్తే ఇక అంతా నేనే. నేనూ నేనే- నేను చూచేదీ నేనే. నాది అని