కప్పటం వల్లనే ఆయన మన బుద్ధులకు గోచరించటం లేదు. ఎప్పుడూ కప్పినదే కనపడుతుంది గాని లోకంలో అది దేన్ని కప్పుతుందో ఆ పదార్ధం కనపడదు. ఎవడైనా ఒక దుప్పటి కప్పుకొని పడుకొంటే వాడు కప్పుకొన్న దుప్పటే మనకు కనపడుతుంది. దుప్పట్లో ఉన్న మనిషి కనపడడు. అలాగే ఇక్కడా త్రిగుణాత్మకమైన సృష్టే గోచరిస్తుంటుం దెప్పుడూ. దీని కాధారమైన ఆ చైతన్యం గోచరం కాదు. కాని అది అచేతనం గాదా తత్త్వం. చేతనమూ సర్వవ్యాపకమూ. యోగమాయ కూడా దాని కధీనమైన శక్తే. తన కధీనమైన శక్తి తన్ను కప్పట మేమిటి. ఒక గారడీ వాణ్ణి వాడి శక్తి కప్పుతుందా. ఏమిటీ మాట. నమ్మబుద్ధి పుట్టటం లేదు మనకు.
అయితే భగవంతుడు చెప్పిన ఈ మాటనెలా అర్ధం చేసుకోవాలి మనం. తన్నే కప్పిందని చెప్పినా అది మన దృష్టితో చెప్పిన మాట. శాస్త్రం తన దృష్టితో చెప్పిన మాట గాదు. అనువాదమే గాని ఇది విధానం గాదు. ఇది ఎలాంటిదంటే మేఘమండలం సూర్యబింబాన్ని కప్పిందని చెప్పటం లాంటిది. నిజంగా సూర్యుణ్ణి కప్పిందా మేఘం. కప్పగలదా. సూర్యుడెంత దూరాన ఉన్నాడు. మేఘం దానికెన్ని కోట్లమైళ్లు క్రింద ఉన్నది. అయినా నేలమీద నిలబడి చూచే మనదృష్టికి సూర్యుడు కనపడక పోయేసరికి మేఘమే దాన్ని కప్పింది అందుకే కనపడటం లేదని అంటామా లేదా. ఇలాటి లోకదృష్టి ననుసరించి చెబుతున్నది శాస్త్రం మాయే మాయావి అయిన ఈశ్వరుణ్ణి ఆవరిస్తున్నదని. ఆయన మాయే ఆయనను ఆవరించట
Page 89