నాహం ప్రకాశః సర్వస్య - యోగ మాయా సమావృతః
మూడోయం నాభి జానాతి లోకో మా మజ మవ్యయం - 25
మోహితం నాభి జనాతి మామేభ్యః పర మవ్యయమని ఇంతకు ముందు వచ్చిన శ్లోకంలాగే నడుస్తున్నదీ శ్లోకం కూడా. కాని అంతకన్నా ఒక విశేషముంది ఈ శ్లోకంలో మనం చెప్పుకో వలసింది. అది దీని కవతారిక వ్రాస్తూ ప్రశ్నరూపంగా బయట పెడుతున్నారు భాష్యకారులు. త దజ్ఞానం కిం నిమిత్తం. ఆ పరతత్త్వాన్నే మానవు డర్ధం చేసుకోలేక పోవటాని కేమిటి నిమిత్తమని అడుగుతున్నా రాయన. దానికి జవాబే ఈ శ్లోక భావం. ఏమిటది. నాహం ప్రకాశ స్సర్వస్య - నేనీ లోకుల కెవరికీ దృగ్గోచరం కావటం లేదు. కారణమేమంటే యోగమాయా సమావృతః యోగ మాయ నన్ను కప్పేసిందంటాడు పరమాత్మ. యోగమాయేమిటి. కప్పట మేమిటి. యోగమంటే సత్త్వరజస్తమో గుణాల కలయిక. అదే మాయ. గుణాల ద్వారా ప్రతి ఒక్క దాన్నీ కొలిచి పారేసి ఇది ఇంతేనని చెప్పేదేదో అదీ మాయ. యోగమాయ అచ్ఛాదించింది పరమాత్మ తత్త్వాన్ని. అందుకే అది ప్రకాశం కావటం లేదు. అంటే ప్రకటమై ఇద మిత్థమని మనకు స్ఫురించటం లేదంటున్నాడు భగవానుడు.
ఏమిటీ విడ్డూరం. ఎంత యోగమాయ అయితే మాత్రమది పరమాత్మను ఆవరించట మేమిటి. ఆయన కధీనమే గదా ఆయన శక్తి. అది ఎలా కప్పగల దాయనను. ఎలా కప్పిందో కప్పింది మొత్తానికి.
Page 88