#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

వాసుదేవ స్సర్వమని గుర్తించిన మహాత్ముడు. అలాటివాడు ఆ తత్త్వంతోనే తాదాత్మ్యం చెందగలడు. క్రొత్తగా చెందటం గాదిది. ఇంతకు ముందు నుంచీ సిద్ధంగా ఉన్న తన స్వరూపాన్నే తాను మరలా అనుభవానికి తెచ్చుకోటమే ఇక్కడ చెందటం పొందటమనే మాటల కర్ధం.

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః
పరం భావ మజానంతో - మమా వ్యయ మనుత్తమమ్ - 24


  అసలు పరమాత్మ స్వరూప మెప్పుడూ అవ్యక్తమే Abstract. వ్యక్తం కాదది. వ్యక్తమంటే బయటపడి కనిపించటం. అలా కనిపించాలంటే దానికొక నామమో రూపమో క్రియో ఉండి తీరాలి. ఇప్పుడీ ప్రపంచ మిలా కనిపిస్తున్నదంటే నామరూపాత్మకం కావటం మూలాన్నే. మన మనసూ ప్రాణమూ శరీరాలు కూడా ఆ మూడు లక్షణాలూ ఉండటం మూలాన్నే కనిపిస్తున్నాయి. ఇదుగో ఇది బాగా అలవాటయి మనకు ఆ పరమాత్మను కూడా నామరూపాల స్థాయికి దించి చూడాలనే కోరుతాము గాని దానికి విలక్షణంగా ఆయన స్థాయి కెదిగి పట్టుకో లేకపోతున్నాము. అందుకే అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే. అవ్యక్తమైన కేవల సచ్చిద్రూపమైన ఆ తత్త్వాన్ని నామరూపాలతో వ్యక్త మయినట్టు భావిస్తున్నారు మానవులు. అవే రామకృష్ణా ద్యవతారాలూ గుళ్లల్లో గోపురాల్లో నెలకొల్పిన విగ్రహాలూ పటాలూ బొమ్మలూ వగైరా వగైరా. అలా భావిస్తే భావించవచ్చుగాక. అది కేవలం భావనే. వాస్తవం కాదు. కారణ మేమంటే సచ్చిత్తులకు నామరూపాలు లేవు. నిరాకారమది. క్రియ అంతకన్నా లేదు.

Page 85

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు