#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

  ఎంచేతనంటే సముద్రం లాంటిది పరమాత్మ చైతన్యమైతే అందులో తరంగాల వంటివీ దేవతలు. సముద్ర జలమే తరంగాల వెలపలా లోపలా కూడా వ్యాపించి ఉన్నట్టు దేవతల కతీతంగా వారి లోపలా ఉన్నదా పరమాత్మే. తరంగ జలమంటే ఏదోగాదు. అక్కడ ఉన్నది సముద్ర జలమే. అలాగే దేవతల మూర్తులంటే ఏవోగావు. తద్రూపంగా ప్రకటమైన పరమాత్మ చైతన్యమే. వారు మన కోరికలు తీరుస్తున్నారంటే తద్ద్వారా తీరుస్తున్నదా పరమాత్మే. అయినా ఈ జ్ఞానం లేక తరంగాల లాంటి ఆ దేవతల వెంటనే బడిపోతుంటారు మానవులు. దేవాన్ దేవయజో యాంతి దేవతోపాసకు లందరూ చివరకు మరణానంతరం వారి భావనకు తగినట్టు ఆ దేవలోకాలకే పోయి ఆ దేవతలు తమకిచ్చే ఆ దివ్య సుఖాలనే అనుభవిస్తారు. అదీ ఎంతో గాదా భోగం. ఎంతో కాలం కాదు. పిండి కొద్దీ రొట్టె అన్నారు. ఆ దేవతల రూపాలే పరిమితమయి నప్పుడు వారివల్ల ఆసించే సుఖం మాత్రం పరిమితం గాక అపరిమిత మెలా కాగలదు. గడువు తీరగానే మరలా తల్ల క్రిందులుగా వచ్చి కర్మ భూమిమీద పడవలసిందే. అదేగదా ఇంతకుముందు చెప్పాడు భగవానుడు శుచీనాం శ్రీమతాం గేహే అని.

  అయితే పరిపూర్ణమైన సుఖం మానవుడి కెలా లభిస్తుందని అడిగితే చెబుతున్నాడు. మద్భక్తా యాంతి మామపి. నా అసలు స్వరూపాన్నే పట్టుకొన్నవాడు మద్భక్తుడు. అంటే భగవత్తత్త్వాన్ని ఆయా దేవతా మూర్తులుగా గాక సచ్చిద్రూపంగా సర్వవ్యాపకంగా ఆత్మస్వరూపంగా గుర్తించినవాడే అసలైన భక్తుడు. భక్తుడంటే భక్తుడు జ్ఞాని అంటే జ్ఞానివాడు.

Page 84

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు