ఒక రజ్జువును సర్పంగా మనం చూస్తుంటే రజ్జువు కూడా తదాకారం గానే మనకు దర్శన మిస్తుంటుంది. చూడటం మన కర్తృత్వమైతే అలా కనిపించటం దాని కర్తృత్వ మనుకోండి పోనీ. రెండూ కర్తృత్వాలే అయినా మనది అజ్ఞానం వల్ల. దానిది అలా కనిపించే శక్తి వల్ల. రజ్జువుకు సర్పంగా కనిపించే స్వభావ ముంది దానిలో గుప్తంగా. లేకుంటే మనం చూచినా అది అలా కనిపించేది గాదు. ఏ పీటనో చేటనో చూచి సర్పమని అపోహ పడం గదా. రజ్జువును చూచే ఎందుకలా భ్రమ పడతాము. సన్నగా పొడవుగా వంకరగా గాలికి కదిలే లక్షణాలు దానిలో ఉండటం వల్లనేగా. అలాగే పరమాత్మలో కూడా ఆయా దేవతా మూర్తులుగా మనకు కనిపిస్తూ మనకు వారిమీద శ్రద్ధాభక్తులు కల్పిస్తూ ఉండే లక్షణం కూడా అంతర్లీనంగా ఉండవచ్చు. దానికే ప్రకృతి అనీ మాయ అనీ శక్తి అనీ పేరు పెట్టింది శాస్త్రం.
అయితే ఒక మాట. సర్పంగా కనిపించే స్వభావం రజ్జువులో ఉన్నా తన పాటికి తానెప్పుడూ అలా కనిపించదు. సర్పమై నిన్ను భయపెట్టదు. అలాటి వాస్తవమైన కర్తృత్వం లేదు దానికి. నీవది సర్పమని చూస్తేనే అలా కనిపిస్తుంది. చూడకపోతే కనిపించదు. అప్పుడు రజ్జువు రజ్జువులాగే దర్శనమిస్తుంది. అలాగే పరమాత్మ కూడా ఆయా దేవతలుగా తనపాటికి తాను కనిపించడు. మనకు వారి మీద శ్రద్ధాభక్తులు కూడా కల్పించడు. రజ్జువును సర్పంలాగా మనమీశ్వరుణ్ణి ఈశ్వరుడని గాక ఆయా దేవతలుగా
Page 79