#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

గ్రహించిన భోగ భాగ్యా లనుభవిస్తా డంటే భోక్త గనుకనే అనుభవిస్తాడు. వీడి కర్తృత్వ భోక్తృత్వాలనే ఆయన కేవలం తనవే అయినట్టు అభినయించి చూపుతున్నాడు. అంత మాత్రమే. ఇది ఎలాటిదంటే ఒక రజ్జువును చూచి అది సర్పమని భ్రమపడ్డా మను కోండి. సర్ప మెక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచీ రాలేదది. మనదృష్టి దోషం వల్లనే రజ్జువు సర్పంలాగా భాసిస్తున్నది. అలా భాసిస్తున్నా అది వస్తువు కాదు. కేవల మాభాసే. రజ్జువులో ఏ వికారమూ లేదక్కడ. రజ్జువు రజ్జువుగానే ఉంది. ఆదిలోనూ అది రజ్జువే. సర్పమని మనం భావించినప్పుడూ రజ్జువే. దీపం పెట్టి చూచి ఇది సర్పం కాదు రజ్జువేనని మనం చూచినప్పు డంతంలోనూ అది రజ్జువే. అందులో మార్పు లేదు. మార్పల్లా మన దృష్టిలోనే. రజ్జువును సర్పంగా చూడటం మన కర్తృత్వం. తన్మూలంగా కలిగిన భయ కంపాదు లను భవించటం మన భోక్తృత్వం. రెండు భావాలూ మనవే. మనకు చెందిన వికారాలే అవి. రజ్జువు మాత్రం నిర్వికారమే ఎప్పుడూ.

  అలాగే పరమాత్మ ఎప్పుడూ నిర్వికారుడే. ఆయన మనకు శ్రద్ధాభక్తులు కల్పించటమూ లేదు. వాటి ఫలం మనమను భవిస్తుంటే అందులో భాగం తనకూ కావాలని మనతో పంచుకోటమూ లేదు. మరి విదధామి అనే మాటలో కర్తృత్వం స్పష్టంగా ధ్వనిస్తున్నదే అని ఇంకా సందేహ ముండవచ్చు. అది కేవల మభినయ మని చెప్పాము. అయినా తృప్తి లేకపోతే ఒక గొప్ప రహస్య మిప్పుడు చెప్పవలసి వస్తున్నది. సావధానంగా వినండి పాఠకులు.

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు