#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

జ్ఞానం కాస్తా పిల్లు లెత్తుకు పోయాయి. అపహరించాయి. జ్ఞానమంటే ఇక్కడ సామాన్య జ్ఞానం. సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్న భగవత్తత్త్వాన్ని చూపేదీ సామాన్య జ్ఞానమే. ప్రతివాడి బుద్ధిలో అంతర్గతంగా ఉందది. కాని పైకి రాకుండా అణగద్రొక్కి పారేశాయి ఆయా విశేషజ్ఞాన వృత్తులు. అవి కామాన్ని రెచ్చగొట్టి ఆయా దేవతామూర్తుల వెంటబడమని పురికొల్పుతుంటాయి. విశేష జ్ఞానమున్నంత వరకూ సామాన్య జ్ఞానం పైకిరాదు.

  మరి దానికేమిటి కారణమని అడగండి. ప్రకృత్యా నియతాః స్వయా అని నెమ్మదిగా బయట పెడుతున్నది గీత. వారి వారి ప్రకృతే వారి నలా నియమిస్తున్నది. కట్టి పడేస్తున్నది. ఏమిటీ ప్రకృతి అంటే. అది రెండు విధాలు. ఒకటి ఈశ్వర ప్రకృతి. మరొకటి జీవ ప్రకృతి. ఈశ్వర ప్రకృతి విద్యాస్వరూపిణి. శుద్ధ సత్త్వోపాధి అంటారు దాన్ని. పోతే జీవ ప్రకృతి విద్యగాదు. అవిద్యా స్వరూపిణి. మలిన సత్త్వోపాధి అని పేర్కొంటారు. సత్త్వానికి పట్టిన ఆ మాలిన్యమే రజస్తమోగుణాలు. అందులో తమస్సు వారికీ జ్ఞానం స్ఫురించకుండా బుద్ధులను కప్పేస్తుంది. కాగా రజస్సు అలా మూతబడిన బుద్ధులను రెచ్చగొట్టి అసలైన ఈశ్వర చైతన్యాన్నే తదా భాసులైన ఇంద్ర వరుణా దిత్యాది దేవతా మూర్తులుగా చూపుతూ వాటిని పట్టుకు కూచోమని పురమాయిస్తుంది. అవిద్య పశుపుత్ర విత్తక్షేత్రాది కామానికి దారితీస్తే - కామ మాయా దేవతల నాశ్రయిస్తే లభిస్తాయని తత్తద్దేవతో పాసనకు లాక్కొని పోతుంది. ఇవే అవిద్యా కామకర్మలనే త్రివిధ

Page 74

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు