కర్మానుష్ఠానంతో గడచి ఉంటాయి. ఇంకా దేవుడు మేలు చేస్తే అనుష్ఠానం కన్నా ముందు నిషిద్ధ కర్మలతో లౌకికమైన సహజ కర్మలతో కాలక్షేపమయి ఉంటుంది. అవన్నీ సోపాన క్రమంలో గడచి బయట పడటానికి పడుతుంది జన్మ పరంపర. అప్పటికొక రహస్యం మనకు శాస్త్రం చెప్పకుండానే తేట తెల్ల మవుతున్నది - కర్మల వల్ల తుదకు భక్తి వల్ల కూడా రాదు ముక్తి. అవన్నీ క్రమంగా ఆత్మజ్ఞానానికి దారితీసి దానికి బలం చేకూరిస్తే ఆ జ్ఞానంవల్లనే ముక్తి అనే మహాఫలం. అవి దేనిపాటికది విడిగా ప్రసాదించలేవు. జన్మలనేవి అప్పటికి వ్యాయామం వంటివి. పరిశ్రమల వంటివి Exercises. కసరత్తు చేయగా చేయగా బలం చేకూరినట్టు అభ్యాసాలు చేయగా చేయగా సంగీత సాహిత్యా కళలలో పరిపాక మబ్బినట్టు కర్మానుష్ఠానం దగ్గరి నుంచీ భక్తి యోగం వరకూ ఇలాంటి అభ్యాసాలు చేస్తూ పోతే చివరకు జ్ఞాన మబ్బుతుంది. అవి జ్ఞాన పరిపాకానికి తోడ్పడే సామగ్రి మాత్రమే. అంతేకాదు. జ్ఞానమనేదే చివరకు గమ్యమనే సత్యం మరచిపోయి దానికి గమకమైన Means వీటితోనే కాలయాపన చేయరాదనే సత్యం కూడా మరచిపోరాదు సాధకుడు. దీన్నిబట్టి జ్ఞాన మనేది అన్నిటికన్నా ఎంత ప్రకృష్టమైన సాధనమో మోక్షానికనే పరమ సత్య మెవరుగానీ మరచిపోరాదు. మరచి ఎక్కడికక్కడే పడిపోయి అదే మనలను ఉద్ధరిస్తుం దంతకన్నా మరేమీ లేదనే భ్రాంతిలో అసలే పడిపోగూడదు. ఇంకా ఒక రహస్యమేమంటే జన్మతః నీకు జ్ఞానవాసన అలవడిన ఉత్తమాధికారివైతే తిన్నగా శ్రవణ మననాదులు చేసి తరించవచ్చు.
Page 68