మనసులో ఆ భావన ఉండగూడదు. అదంతా త్రిగుణాత్మకమైన క్షేత్రంలో జరిగే వ్యవహారమే. గుణాతీతమైనదే అయితే వారి దృష్టి గుణాతీతంగానే చూడాలా పరమాత్మాను. ఒకానొక నామమనీ రూపమనీ దానిమేరకు దించి చూడరాదు. ఒకానొక రూపాన్నే ఇష్ట దైవతమని భావించరాదు. మూర్తం కాదది అమూర్తం వాస్తవంలో. అలాటి అమూర్త భావన ఏర్పడితే అది ఏదో గాదు. అమూర్తమైన తన జ్ఞానమే. ఎక్కడో గాదది ఎక్కడ బడితే అక్కడ. ఎప్పుడో భజన చేస్తూ కూచుంటేనే గాదు. ఎప్పుడంటే అప్పుడు. ఆ పని చేస్తుంటేనే గాదు. ఏ పని చేస్తున్నా. ఆ విగ్రహంలోనే గాదు. చరాచర పదార్ధాలలో ఏ పదార్ధాన్ని చూచినా సమస్త ప్రపంచాన్నీ శుద్ధ చైతన్యాత్మకంగా అది తన స్వరూపంగా తన కనన్యంగానే దర్శించ గలిగి ఉండాలి. అప్పుడది మీరూ మేమూ మామూలుగా అనుకొనే భక్తిగాదు. అనన్య భక్తి. లేదా జ్ఞానం. కనుకనే దాన్ని అనుత్తమాం గతిం అనిచాటుతున్నది గీత. దేనికన్నా ఇక ఉత్తమమనే ప్రసక్తి లేదో అది అనుత్తమం The supreme The super most గతి కూడా అదే. గతి అన్నారు గదా అని గమనం ప్రయాణమనీ ఎక్కడికో వెళ్లిపోతామనీ మరలా భ్రమపడరాదు. సర్వస్య ప్రత్యగాత్మత్వా దవగతి రేవగతి రిత్యుపచర్యతే అని దాన్ని వ్యాఖ్యాంచారు స్వామివారు కఠోపనిష ద్భాష్యంలో. సర్వ ప్రపంచానికీ స్వరూపమదే కాబట్టి దాని అవగతే దాని అనుభవమే గతి మరేదో ఎక్కడికో ప్రయాణమయి పోవటం కాదన్నారాయన.
Page 64