కాబట్టి ఆర్తుడి దగ్గరి నుంచీ అందరూ మోక్షమార్గంలో ఉన్నవారే. కాని అప్పుడే జ్ఞానులు కారు. ముక్తులు కారు. అవుతారు క్రమంగా కృషి చేస్తూపోతే. చాలాకాలం పట్టవచ్చు. వర్తమాన జన్మలోనే జ్ఞాన మలవడక పోయినా భావి జన్మలోనైనా పట్టుపడక పోదు. పోతే అలా పట్టుపడ్డ జ్ఞాని ఉన్నాడే. వాడు బంగారం. మేలిమి బంగారం. నూటికి కోటికొక డుంటా డలాటి వాడు. మిగతా ఆర్తాదు లలాటి వాడు కాదువాడు. జ్ఞానీత్వాత్మైవ మే మతం. జ్ఞాని మాత్రం నా ఆత్మే నా స్వరూపమే నంటున్నాడు పరమాత్మ. మే మతం - అదీ నా అభిప్రాయ మని తెగేసి చెబుతున్నాడు. జ్ఞానీతు అనే చోట తు అనేమాట ఒకటుంది. అది విశేషణార్ధకం. అంటే అందరికన్నా విలక్షణుడీ Unique జ్ఞాని అని అర్ధం. ఏమిటా విలక్షణత్వం. ఆత్మైవ. భగవత్స్వరూపుడే జ్ఞాని. ఆత్మ అంటే స్వరూపం Self. భగవంతుడి కొక స్వరూపం జ్ఞానికొక స్వరూపమంటూ లేవు. ఇద్దరూ కలిసి ఒకే ఒక ఆత్మ. ఏకాత్మ.
మరి ఇతరులో. వారు ఆత్మీయులే Mine గాని ఆత్మ I కారు. వారూ భజిస్తూనే ఉన్నారు గదా పరమాత్మను. నిజమే. భజిస్తూనే ఉన్నారు. కాని తాము వేరు తాము భజించే పరమాత్మ వేరని చూస్తుంటారు. ఆత్మ కాడాయన అనాత్మ. ఆర్తు డాయనను ఆర్తత్రాణ పరాయణుడుగా భావిస్తాడు. జిజ్ఞాసు వెక్కడో ఉందా భగవత్తత్త్వం దాన్ని అందుకోవాలనే ఇచ్ఛతో ఉంటాడు. పోతే అర్థార్థి అసలైన తత్త్వమేమిటా అది ఎలా ఉంటుందా
Page 62