#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము



ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం
ఆస్థిత స్సహి యుక్తాత్మా - మామే వానుత్తమాం గతిమ్ - 18


  కాని సాక్షాత్తుగా మోక్షానికి గాకపోయినా దానికి సాధనమైన జ్ఞానాని కివి సాధనాలు కాబట్టి ఉదారా స్సర్వ ఏవైతే. ఆర్తి దగ్గరినుంచీ అన్నీ గొప్పవే. ఉదారా అంటే పై స్థాయికి నిన్ను ఎదిగించేవని అక్షరార్ధం. అంతకంతకు ఆరోహణకు తోడ్పడేవే గాని అవరోహణానికి కావు. కేవల మధికారి భేదాన్ని దృష్టిలో ఉంచుకొనే నాలుగు భూమికలు Stages వర్ణించింది భగవద్గీత. అసలు సన్మార్గానికి దూరదూరంగా బేహోదాగా బ్రతికే రాజస తామస ప్రకృతులైన మానవులకంటే అంతో ఇంతో సాత్త్వికమైన స్వభావానికి చెందిన వాడెంతో మేలనుకో మంటున్నది గీత. అసలు ఆర్తి అనేదుంటే ఎప్పటికైనా తత్త్వ జిజ్ఞాస ఏర్పడుతుంది. జిజ్ఞాస ఉంటే అసలైన తత్త్వం మీద దృష్టి పడక పోదు. అలాటి అర్థార్థిత్వముంటే అదే జ్ఞానానికి చేరుస్తుంది. కనుక దేన్నీ పనికిరాదని కొట్టి వేయరాదు. గమ్యం చేరకపోయినా మార్గంలో ఉన్నారని సంతోషించాలి మనం. అందుకే అంటారొక చోట భగవత్పాదులు. సన్మార్గ స్థా స్తావ ద్భవంతు - శనై ర్బోధయి ష్యామితి మన్యతే శ్రుతిః అని ఛాందోగ్య భాష్యం. ముందు సన్మార్గంలో అడుగుపెట్ట నివ్వండి. తరువాత వారికేదైనా చెబితే క్రమంగా బోధ పడుతుందంటా రాయన. దీనికే సోపాన క్రమమని కూడా పేరు పెడతారు.

Page 61

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు