#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

  అంతే కాదు. ఇలాటి సర్వోత్కృష్టమైన జ్ఞానం సంపాదించిన మహాత్ముడు గనుకనే ప్రియోహి జ్ఞానినోత్యర్థ మహం. సర్వవ్యాపకమైన భగవత్తత్త్వమే అత్యంత ప్రేమపాత్రమైనది జ్ఞానికి. సర్వవ్యాపకమైన తత్త్వాలెన్నో ఉండవు. సర్వత్ర వ్యాపించిందంటే ఏదైనా నిరాకారం కాక తప్పదు. నిరాకారమైతే నిశ్చలం కూడా కాక తప్పదు. అలాంటి దొక్కటే ఉండగలదు గాని రెండు మూడుండవు. ఉందన్నావంటే సర్వవ్యాపకమనే మాట కర్ధం లేదు. ప్రస్తుతం జ్ఞాని అంటున్నావు పరమాత్మ అంటున్నావు. రెండూ వ్యాపకా లంటున్నావు. అవి రెండెలా కాగలవు. ఒక్కటే కావాలి. కనుకనే జ్ఞాని భగవత్తత్త్వాన్ని ప్రేమిస్తున్నాడంటే తన కన్యంగా ఒక భగవంతుడున్నాడని గాదు. తన స్వరూపాన్నే తాను అభిమానిస్తాడని భావం. అలాగే సచ మమ ప్రియః ఆ భగవానుడు కూడా ఈ జ్ఞాని అంటే ఎంతగానో అభిమానిస్తాడట. ఈ మాట ఎందుకు చెప్పినట్టు మళ్లీ. ఒక ఆంతర్యముంది ఇందులో. వీడు వాణ్ణి వాడు వీణ్ణి అని చెప్పినప్పు డిద్దరూ వేరుగాదు. ఇద్దరుగా కనపడటం కేవలమా భాస. వాస్తవంలో జ్ఞానస్వరూపంగా ఇద్దరూ ఒకటే నని జీవ బ్రహ్మైక్యాన్ని భంగ్యంతరంగా చాటుతున్నది గీత. ఇలాటి అద్వైత భావం జ్ఞాని విషయంలో మాత్రమే చెప్పిందంటే అప్పటికి కర్మ ధ్యాన భక్తి యోగాలనే మొదటి మూడు భూమికలలో అలాటి భాగ్యం లేదని వేరే చెప్ప నక్కరలేదు. కనుకనే అవి మూడూ జ్ఞానోత్పత్తికి తోడు పడే సాధనాలే గాని జ్ఞానం లాగా మోక్షసాధనాలు కావని ఘోషించటం.

Page 60

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు