అందుకోసం నవమాధ్యాయం కావలసి వచ్చింది. అది రాజవిద్యా రాజ గుహ్యం. జ్ఞానమూ అనుభవమూ రెండూ కావాలి సాధకుడికి. అది ఎక్కడికో పోయి అందుకొనేది కాదా బ్రహ్మం. ప్రత్యక్షావ గమం. ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది నీకు. సుసుఖం కర్తుం. దాన్ని పట్టుకోటం కూడా చాలా సులభమని హామీ ఇస్తున్నది. ఎందుకంటే అది సర్వవ్యాపకం. అన్నీ అందులోనే ఉన్నాయి. అన్ని రూపాలుగా దర్శన మిస్తున్న దదే. అలా కనపడటానికి కారణం దాని ప్రకృతి. దాని స్వభావం. స్వరూపంగా విభూతిగా అదే ఉంది. మరేదీ గాదని అలాగే అర్థం చేసుకోమని సలహా ఇస్తుందీ అధ్యాయం సాధకుడికి.
అయితే మరి స్వరూప మొకటి విభూతి ఒకటి రెండున్నాయి గదా. అవి రెండూ ఒకటెలా అవుతాయని ప్రశ్న వస్తే దానికి జవాబిస్తుంది పదియవదైన విభూతి యోగమనే అధ్యాయం. యోగమంటే స్వరూపం. విభూతి అంటే దాని విస్తారం. జలం లాంటిది స్వరూపమైతే తరం బుద్బుదాల లాంటివి దాని విభూతి. తేడా ఏముంది. రెండని మాటేగాని జాగ్రత్తగా అర్థం చేసుకొంటే రెండూ కలిసి ఒకే తత్త్వం. తేడా లేదు. అలాగే పరమాత్మకు ఆయన సృష్టించాడని భావించే జీవ జగత్తులకూ ఏమాత్రమూ భేదం లేదు. అదే చెబుతున్నాడు కంఠోక్తిగా. అహమాత్మా