అభిన్నంగా తన స్వరూపాన్ని బయటపెడతాడు. దీన్ని బట్టి జీవ జగత్తులు పరమాత్మ మీద ఆరోపితమే గాని వాస్తవంలో అవి ఆయనకు భిన్నంగా ఎక్కడా లేవని అర్థమవుతున్నది. పైగా మత్తః పరతరం నాన్యత్కించి దస్తి. నాకు వేరుగా ఏదీ లేదు. మయి సర్వమిదం ప్రోతం. కారణ మేమంటే నాలోనే ఉన్నదంతా. రసోహ మప్సు నాలో జగత్తుంది జగత్తులో నేనున్నానని చాటుతాడు.
మరి అలాటి తత్త్వాన్ని అందుకోట మెలాగా అని అడిగితే ధారణాయోగం చెబుతాడు అక్షర పరబ్రహ్మ యోగమనే అష్టామాధ్యాయంలో. ఆ అధ్యాయమంతా చిత్తైకాగ్రత కోసం చెప్పిందే. మనసే గదా పరమాత్మ నందుకొనే సాధనం. సాధనం చురుకుగా పనిచేయక పోతే సాధ్యమనేది అనుభవానికి రాదు. కనుక ఏకాగ్రత అనే పదును పెట్టుకోమని సలహా ఇస్తుంది ఎనిమిదవ అధ్యాయం మనకు. ఓంకార మాలంబనంగా చేసుకొని మూర్ధన్యనాడి ద్వారా ప్రయాణం చేసి పోతే అవసానంలో చివరికా బ్రహ్మలోకం చేరుతాడని హామీ ఇస్తాడు భగవానుడు. కాని ఇది కార్య బ్రహ్మమే. పర బ్రహ్మం కాదు. కనీసం ఉట్టికైనా ఎక్కితే తరువాత చూడవచ్చునని ఒక స్టేజిగా సాధకుడికి చెప్పిన మాట ఇది. సగుణమే ఇది ఇంకా నిర్గుణం కాదు. అంటే శోధన సగమే అయింది. పూర్తి కాలేదు.