ఉన్నాయి. ఇవన్నీ నిర్గుణ జ్ఞాని లక్షణాలే గాని సగుణ భక్తుడి లక్షణాలు కావు. అది ఆయా సందర్భాలను బట్టే మనమర్థం చేసుకోవచ్చు.
కాగా ఇప్పుడీ భక్తుడి లక్షణాలు మహర్షి ప్రపంచిస్తున్నాడంటే ఆ భక్తుడెవడో వేరుగా చెప్పనక్కర లేదు. అనన్య భక్తుడైన జ్ఞానే అతడు. అతని లక్షణాలే ఒక్కొక్కటి బయటపెడుతున్నది గీత. విందాం. అద్వేష్టా సర్వభూతానాం. ఇదీ జ్ఞాని కుండవలసిన మొదటి గుణం. గుణంకాని గుణమిది. జ్ఞానికి గుణమంటూ ఒకటి వేరుగా ఉండదు. గుణం గాని గుణమే జ్ఞానిది. చెప్పాము గదా ఇంతకు పూర్వం. సాధకుడికేది ప్రయత్నమో సిద్ధుడి కది లక్షణమని. లక్షణం గుణమంటే ఇక్కడ స్వరూపాని కభిన్నమే నని గ్రహించాలి మనం. His very nature or character. అద్వైతంలో ద్రవ్యానికీ గుణానికీ తేడా లేదు. ద్రవ్యంతో అవినాభూతం దాని గుణం. జలానికి ద్రవత్వం గుణమని చెప్పావంటే జలమే ద్రవం ద్రవమే జలం రెండూ ఒకటేనని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ గుణాలన్నీ ఏకరువు పెడుతున్నా రంటే ఇవేవో జ్ఞాని అయిన వాడికి వేరుగా ఎక్కడో ఉన్నాయి అవి జ్ఞాని దగ్గర పెట్టుకొంటాడని గాదు. అతని స్వరూపాని కన్యంగా ఎక్కడా లేవవి. గుణాలన్నీ స్వరూపమే. అలాంటి గుణాలు గాని గుణాలే పరిగణిస్తున్నా డిప్పుడు గీతాచార్యుడు. అందులో మొదటిది అద్వేష్టా సర్వభూతానాం.
Page 524