#


Index


భక్తి యోగము

ఇప్పుడక్షరో పాసకులూ సమ్యగ్దర్శన నిష్ఠులూ ఏషణాత్రయాన్ని త్రోసిపుచ్చి సన్న్యసించిన మహాభావులెవరో అలాటి జ్ఞానుల కున్న లక్షణాలేవో అవే సాక్షాత్తూ మోక్షదాయకమనే అభిప్రాయం వెలిబుచ్చుతూ అద్వేష్టా సర్వభూతానా మని మొదలుపెట్టి వాటిని వర్ణిస్తూ పోతున్నాడు భగవానుడు. ఇదీ భగవత్పాదు లిక్కడ వ్రాసిన అవతారిక. ఆయన చేసిన గొప్ప వ్యాఖ్యానం.

  దీనిని బట్టి మనకు తేలిన సారాంశమేమిటి. భగవద్భక్తే భగవంతుణ్ణి చేరే మార్గం. అంతవరకూ ఆక్షేపణ లేదు. కాని ఆ భక్తి అనేది ఒకటి గాదు. అందులో సగుణ భక్తీ ఉన్నది. నిర్గుణ భక్తీ ఉన్నది. రెండూ భక్తే అయినా ఒకటి గుణాలతో కలిపి పట్టుకొనేదా భగవంతుణ్ణి. ఇంకొకటి గుణాలను మనసుకు రాకుండా నిర్గుణంగా పట్టుకొనేది. ఇందులో మొదటి దీశ్వరుడైతే రెండవది పరమాత్మ. ఈశ్వరుణ్ణి పట్టుకొన్నా మంచిదే కాని అది అసలైన తత్త్వం కాదు. పరమాత్మ తాలూకు విభూతి ఈశ్వరుడు. పరమాత్మే భక్తుడి దృష్టి ననుసరించి సగుణంగా భాసిస్తుంటాడు. అది భగవ ద్విభూతే గాని భగవత్స్వరూపం కాదు. విభూతిలో జీవేశ్వరులకు భేదముంటుంది. జీవుడేమిటి జగత్తేమిటి ఈశ్వరు డేమిటి. అంతా కలిపి ఆత్మ స్వరూపమే ననే అభేద దృష్టి లేదు. అందుకు కారణ మీ గుణాలే. పోతే గుణాలను లయం చేసుకొని చూచే అభేద దృష్టి నిర్గుణో పాసకుడైన

Page 521

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు