#


Index

భక్తి యోగము

కర్మ యాంత్రికంగా చేస్తూ దాని ఫలితం మంచో చెడో ఆయనకే అప్ప చెప్పాలి సాధకుడు. తనకుగా ఏదీ ఆసించగూడదు. కర్మ కాకున్నా కర్మ ఫలాన్ని అయినా త్యజించ గలిగి ఉండాలి. అప్పటికి కర్మ చేస్తున్నా తాను కర్త గాదు. కర్మ ఫలం కోరకుండా చేస్తుంటాడు కాబట్టి భోక్తా కాడు. కాకుంటే రజస్తమో మాలిన్యం పూర్తిగా వదలిపోయి నట్టే.

  రజస్సే కర్తృత్వ బుద్ధి. తమస్సే భోక్తృత్వ బుద్ధి. అవి రెండూ లేవంటే సత్త్వం శుద్ధి అవుతుంది. సత్త్వం శుద్ధి అయితే జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. సత్త్వా త్సంజాయతే జ్ఞానమని గుణత్రయా ధ్యాయంలో రాబోతుంది. దీనివల్ల చాలా వరకు ముందుకు పోగలుగుతాడు సాధకుడు. అయితే యతాత్మవాన్. అనుకొన్నంత సులభం కాదిది. ఆత్మ యత మయి ఉండాలి. ఆత్మ అంటే ఇక్కడ మనసూ ప్రాణమూ ఇంద్రియాలూ శరీరమూ నాలుగూ. ముఖ్యంగా మనసు. మన ఏవ మనుష్యాణా మన్నట్టు మనసే గదా సాధనం దేనికైనా. అంచేత అది యత మయి ఉండాలి సాధకుడికి. సంయతమే యతం. తన చెప్పుచేతల్లో ఉండాలని అర్థం. మనస్సుకు మనం కాదు. మనసు మనకు వశమయి ఉండాలి. అప్పుడే అది చెప్పిన మాట వింటుంది. నిష్కామంగా కర్మ చేయమన్నా చేస్తుంది. నేను గాదు ఈశ్వరుడే నా ద్వారా ఈ కర్మ చేస్తున్నాడాయనే కర్త ఆయనే భోక్త అనుకోమన్నా

Page 514

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు