
మాయాశక్తిని వశం చేసుకొన్నాడు గనుకనే ఈశ్వరుడనే Master or Com-mander పేరు సార్ధకంగా ఏర్పడింది. సృష్టి స్థితి సంహారాలన్నీ దానివల్లనే చేయ గలుగుతున్నా డాయన. తాను రామ కృష్ణా ద్యవతారాలన్నీ ఎత్త గలుగుతున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణాదులు పాటించ గలుగుతున్నాడు. అలాటి ఈశ్వర భావం ప్రాప్తిస్తే ఇక కావలసిందే ముంది సాధకుడికి.
అభ్యాసే ప్యసమర్థోసి - మత్కర్మ పరమో భవ
మదర్ధ మపి కర్మాణి - కుర్వన్ సిద్ధి మవాప్స్యసి - 10
కాని అదైనా చేయగలడా ఈ మానవుడు. ఏమో. అనుమానమే పరమాత్మకు. ఆనాటి ఒకానొక నరుడి విషయమే కాదు. ఏనాటి నరుణ్ణి చూచినా నమ్మడాయన. మన మనోదౌర్బల్య మెలాంటిదో మనకు తెలియదేమో గాని మనలాటి జీవులను కోటాన కోట్లను సృష్టించి పారేసిన పరమాత్మ కెప్పుడో తెలుసు. సర్వజ్ఞుడు గదా పరమాత్మ అంటే. భూత భవిష్యద్వర్త మానాలలో ఆయనకు తెలియని దేముంటుంది. అలాటి సర్వజ్ఞత ఉండటం వల్లనే మన బలహీనత పసిగట్టి రాయితీలిస్తూ పోతున్నాడిప్పుడు. అభ్యాసే ప్యసమర్థోసి. అభ్యాసం చేయటానికి కూడా ఓపిక లేదా నీకు. అభ్యాసమంటే ఏదో చెప్పాడు గదా. అటూ ఇటూ చెదరిపోయే మనసు నలా పోకుండా మళ్లించి ఒకే రూపం మీద పెట్టే ప్రయత్నమని.
Page 511
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు