#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

వర్ణించే గీతా వాక్యంలో లేదు దోషం. ఉన్న దోషమంతా దాన్ని యథాతథంగా గ్రహించటం గ్రహించక పోవటంలోనే ఉంది. ఏష సర్వేషు భూతేషు గూఢత్మా న ప్రకాశతే దృశ్యతే తు - అని చాటించిన కఠోపనిష ద్వాక్య భావమీ రెండు శ్లోకాలలో తొంగి చూస్తున్నది. అలమతి విస్తరేణ.

న మాం దుష్కృతినో మూఢాః - ప్రపద్యంతే నరాధమాః
మాయయా 2 పహృత జ్ఞానాః ఆసురం భావ మా శ్రితాః - 15


  అయితే ఒక మాట. అందరూ నామార్గంలోనే ఉన్నారు ఎవరూ నా సరిహద్దులు దాటిపోలేదని గదా మొదటి నుంచీ చెబుతూ వచ్చాడు భగవానుడు. అలాంటప్పుడు మామేవ యే ప్రపద్యంతే తే. ఎవరు నన్ను పట్టుకొంటే వారు తరిస్తారని కొందరినే చూపి చెప్పటం దేనికి. అందరూ భగవన్మార్గంలోనే ఉన్నప్పుడు భగవత్తత్త్వాన్ని ప్రతి ఒక్కరూ పట్టుకోవాలి గదా. ఎందుకుగాను నూటికి తొంభయి మంది పట్టుకోలేక పోతున్నారు. కొందరే పట్టుకో గలుగుతున్నారు. వారేమైనా పరమాత్మకు దగ్గరి చుట్టాలా. వీరలా కాక ఆయనకు గర్భశత్రువులా. శత్రువులైతే నమే ద్వేష్యోస్తి న ప్రియః నాకు శత్రువులూ లేరు - మిత్రులూ లేరు సర్వసముణ్ణని ఎలా అనగలిగాడని పెద్ద ఆక్షేపణ వస్తున్న దిప్పుడు. దీనికి సమాధానమే ఈ శ్లోకం.

  నమాం ప్రపద్యంతే నరాధమాః - నరాధములైన వారు నన్ను చేరలే రంటున్నాడు. మానవులలోనే ఉందీ దోషం. నాలో కాదంటాడు భగవానుడు. నిర్దోషం హి సమం బ్రహ్మ అని ఇంతకుముందే వాక్రుచ్చాడు.

Page 51

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు