#


Index

భక్తి యోగము భగవద్గీత

  వ్యష్టి నిరంతరమూ సమష్టి భావన చేస్తూపోతే ఎప్పటికో ఒకప్పటికి భ్రమర కీటన్యాయంగా సమష్టిగా మారే అవకాశముంది. అదే చెబుతున్నా డిప్పుడు. ఏమని. నివసిష్యసి మయ్యేవ. నాయందే నీవు నివసిస్తా వర్ణునా. నివసించటమంటే అర్థం చెబుతున్నారు భాష్యకారులు. నిశ్చయేన మదాత్మనా మయి నివాసం కరిష్యసి. తప్పకుండా నా రూపంతో నాలోకంలోనే ఉండి పోతావు. అంటే సగుణోపాసన కాబట్టి ఇది సాలోక్య సారూప్య ముక్తి లభిస్తుంది భక్తుడికి. అది సర్వాత్మ భావమైన మోక్షం కాకున్నా దానికి కొంచెం దగ్గర. అదైనా ఎప్పుడా భాగ్యం. బ్రతికుండగా మాత్రం కాదు. బ్రతికున్నా కలిగేది సద్యోముక్తి. ఇది అలాటిది కాదు. క్రమముక్తి. సగుణోపాసకుడు మరణానంతరం సూక్ష్మ శరీరంతో కార్య బ్రహ్మ లోకానికి వెళ్లి అక్కడ బ్రహ్మ కల్పం తీరగానే ఆయనతో పాటు నిర్గుణ జ్ఞానం సంపాదించి అక్కడికక్కడే విదేహ ముక్తుడవుతాడు. నిర్గుణోపాసకుడైన వాడు జ్ఞానే కాబట్టి బ్రహ్మలోక శిక్షణ అక్కర లేకుండా ఇహంలోనే సద్యోముక్తి పొందగలడు. అందుకే చెబుతున్నాడు అత ఊర్థ్వం న సంశయః అని భగవానుడు. అత ఊర్థ్వం అంటే శరీర పాతాదూర్ధ్యం దేహపాతమైన తరువాత అని స్పష్టంగా వ్రాస్తున్నారు ఆచార్యుల వారు. సగుణోపాసకులైన భక్తులు దేహ పాతం వరకూ వేచి ఉండవలసిందే. తరువాత సత్యలోకం చేరి అక్కడ నిర్గుణ జ్ఞానానికి శిక్షణ పొంది తరించవలసిందే.

Page 508

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు