#


Index

భక్తి యోగము భగవద్గీత

  ఇంకా ఎలాంటిదా ఆత్మ తత్త్వం. సర్వత్రగ మచింత్యంచ. ఆత్మ అంటే నేననే జ్ఞానమని గదా చెప్పాము. అది ఈ శరీరం మేరకే పరిమిత మయినట్టు భావిస్తుంటాడు మానవుడు. అలా కాదది. సర్వత్రా వ్యాపించి ఉంది. శరీరంలో లేదని కాదు. శరీరే భవతి న శరీర ఏవ అంటారొక చోట ఆచార్యుల వారు. శరీరంలోనే కాదు. శరీరం బయట కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది. ఆతనోతీతి ఆత్మా. అంతటా వ్యాపకమైన దేదో అదే ఆత్మ అని ఆత్మ శబ్దానికి వ్యుత్పత్తి. వ్యోమ వ ద్వ్యాపి అని స్వామివారి మాట. ఆకాశంలాగా వ్యాపించిన తత్త్వమది. అంచేతనే అచింత్యం. మనసుతో కూడా ఆలోచించ లేము. పట్టుకోలేము దాన్ని. మనసులోని ఆలోచనలకు కూడా సాక్షి అయి వాటిని కనిపెట్టి చూస్తున్న జ్ఞానమది. అలాంటప్పుడు మనసు దాన్ని వెనక్కు తిరిగి పెట్టుకోట మెలా సాధ్యం. అందుకే మనసోమనః అని చాటుతున్నది కేనోపనిషత్తు.

  అంతే కాదు. కూటస్థ మచలంధ్రువం. దృశ్యమాన గుణ మంత ర్దోషం. వస్తుకూటం. మేడిపండులాగా పైకి గొప్పగా కనిపిస్తూ లోపల డొల్ల అనిపించే దానికి కూటమని పేరు. కూట సాక్ష్యం కూట రూపమిత్యాదౌ కూట శబ్దః ప్రసిద్ధి లోకే. కూట సాక్ష్యం కూటరూపమనే ప్రయోగాలలో ఇది బాగా ప్రసిద్ధమే ఈ మాట. అంటే మోసమని అర్థం. అలాంటిదే త్రిగుణాత్మికమైన ఈశ్వరమాయ. అవిద్యాద్యనేక సంసార

Page 492

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు