భక్తి యోగము
భగవద్గీత
నేనంటే ఎవరా నేను. విశ్వరూపుడైన పరమేశ్వరుడని అర్థం వ్రాశారు భగవత్పాదులు. మా ముపాసతే అన్నప్పుడెవరా నన్ను. సర్వయోగీశ్వరాణా మధీశ్వరం సర్వజ్ఞం విముక్త రాగాదిక్లేశ తిమిర దృష్టిం - యోగీశ్వరుల కీశ్వరుడయి సర్వజ్ఞుడూ రాగద్వేషాది దోషరహితుడైన వాణ్ణి అని అర్థం చెప్పారు. ఇలాటి జ్ఞానైశ్వర్యాది గుణ గణాలున్న వాడు బ్రహ్మమా ఈశ్వరుడా మీరే చెప్పండి. బ్రహ్మమే సగుణమైతే ఈశ్వరుడని గదా పేర్కొన్నాము. సగుణమైతే అన్నప్పుడెక్కడి నుంచో వచ్చి సంక్రమిస్తాయని గాదు అర్థం. అంతకు ముందు లేని గుణం క్రొత్తగా ఎక్కడి నుంచీ హఠాత్తుగా వచ్చి పడదు. ఉన్నదే స్వరూపంలో గుప్తమై అవ్యక్తంగా ఉండిపోతే అది నిర్గుణమనే మాట కర్థం. అప్పుడది పరమాత్మ. అలా అవ్యక్తమైన ఆ గుణమే వ్యక్తమయి కనిపిస్తే అది సగుణం. ఇందులో నిర్గుణమైన అధిష్ఠానాన్ని గుర్తించక ఆరోపితమైన సగుణ తత్త్వాన్నే చూస్తూ దాని మీదనే మనసు లగ్నం చేసి ధ్యానిస్తూ పోతారు భక్తులు. శ్రద్ధయా పరమోపేతాః శ్రద్ధా భక్తులెక్కువగా ఉంటాయి వారికి. శ్రద్ధా అంటే ఆస్తిక్య బుద్ధి. భక్తి అంటే దాని నంటి పట్టుకొనే దీక్ష. ఇవి రెండూ ఉంటే చాలు. వారు మహాభక్తులు. వారే యుక్తతములు. నన్ను పట్టుకోటమే యోగం. అది తెలిసిన వాడు యోగవిత్. అందులో పండిపోయిన వాడు యోగ విత్తముడు. వాడే యుక్తతముడన్నా. అలాటి యుక్తతములు వారేనని మతాః నా అభిప్రాయ మంటాడు భగవానుడు.
Page 489